చెన్నై తారాపురంలో విద్యార్ధిని కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్ జిల్లా వేడచందూర్‌కు చెందిన తమిళరసి, ముత్తరసి అక్కాచెల్లెళ్లు.. అక్కకి వివాహం జరిగి తిరుపూర్‌లో నివసిస్తుంది. తన అక్కను చూసేందుకు ముత్తరసి తరచుగా తిరుపూర్ వెళ్లేది.

ఈ క్రమంలో అత్తుక్కాల్ పుదూర్‌కి చెందిన డ్రైవర్ భరత్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వేడచండూర్‌‌కి వెళ్లిన భరత్, ముత్తరసిని కిడ్నాప్ చేసి ఐదు నెలల పాటు బంధించాడు. తన చెల్లి అదృశ్యంపై తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు ముత్తరసి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారి అనుమానం భరత్‌ మీదకు వెళ్లింది.  దీంతో గురువారం ఆత్తుక్కాల్‌పుదూర్‌లో ఉన్న భరత్‌ను తమదైనశైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు.

తాను ముత్తరసిని పెళ్ళి చేసుకోవడానికి కిడ్నాప్ చేశానని.. అయితే కొద్దిరోజుల్లోనే తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఓ రోజు భరత్.. ముత్తరసిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు.

అక్కడ మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన భరత్.. ఆమెను బలంగా కొట్టాడు. దీంతో ముత్తరసి అక్కడే స్పృహతప్పి పడిపోయింది. దిగ్భ్రాంతి చెందిన అతను అక్కడి నుంచి ఆత్తుక్కాల్‌పుదూర్‌లోని తన ఇంటికి తీసుకువచ్చాడు.

ఈ విషయం గురించి భరత్ తన కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న భరత్ కుటుంబసభ్యులు... హత్య విషయం బయటకు తెలియకుండా ఇంటి వెనుక భాగంలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు.

అనంతరం భరత్‌కి.. వీరాట్చి మంగళమ్‌కి చెందిన మరో యువతితో వివాహం నిశ్చయించారు. ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు శవం పాతిపెట్టడం మంచిది కాదని భావించిన వారు మృతదేహాన్ని మళ్లీ తవ్వి బయటకి తీశారు.

అప్పటికే ముత్తరసి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్న పొట్టల్‌కాడుకి తీసుకెళ్లి ఆమె శవాన్ని కాల్చేశారు. వైకాసి నెలలో భరత్‌కి వివాహం చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా భరత్‌, అతనికి సహకరించిన ఇద్దరు బంధువులను అరెస్ట్ చేసి వేదచందూర్‌కు తరలించారు.