తన ప్రేమను కాదన్న కోపంలో ఓ యువకుడు ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై షావుకార్ పేటకు చెందిన సుమర్ సింగ్... స్థానిక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కాజల్‌ను ప్రేమ పేరుతో వేధించేవాడు.

ఆమె ప్రేమించేదాకా నెలల తరబడి వెంటబడటంతో ఎట్టకేలకు కాజల్ కూడా అతనితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా ఇద్దరు కలిసి తిరిగేవారు.. దీనికి తోడు కాజల్ సంపన్న కుటుంబానికి చెందిన యువతి కావడంతో విలాసాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేసేది.

వీరిద్దరూ తరచుగా హోటల్స్, లాడ్జిల్లో దిగుతూ జల్సాలు చేసేవారు. అయితే వీరి ప్రేమ విషయం కాజల్ కుటుంబానికి తెలియడంతో ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని ఆమె సుమర్ సింగ్‌కు చెప్పి సంబంధాన్ని కొనసాగించింది. అయితే తనకు ఇంకా డబ్బు కావాలని వేధించడంతో సుమర్‌సింగ్‌పై విరక్తి చెందిన కాజల్.. తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది.

దీంతో అగ్గిమీద గుగ్గిలమైన సుమర్ సింగ్ తనకు దక్కని ప్రియురాలు మరొకరికి భార్యగా ఉండకూడదని భావించాడు. ప్లాన్ ప్రకారం... చివరిసారిగా మాట్లాడుకుందాం.. ఇక ఎప్పుడు ఇబ్బంది పెట్టనని చెప్పడంతో కాజల్ సరేనని సుమర్‌సింగ్ చెప్పిన లాడ్జీకి ఈ నెల 10న వచ్చింది.

కొద్దిసేపు మాట్లాడుకున్న అనంతరం అప్పటికే సిద్ధం చేసుకున్న కూల్‌డ్రింక్‌ను యువతి చేత తాగించాడు. అనంతరం స్కార్ఫ్‌తో ఆమె గొంతు బిగించి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను కూడా విషం కలిపిన కూల్ డ్రింక్ సేవించాడు.

మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు ఎంతగా తలుపు తట్టినా తీయకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా.. సుమర్ సింగ్, కాజల్ నోట్లో నుంచి నురగలు కక్కుతూ పడివున్నారు.

కాజల్ అప్పటికే మరణించి వుండటంతో ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి... సుమర్‌సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో కాజల్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అని తేలడంతో ఆసుపత్రిలో ప్రాణాలతో బయటపడిన సుమర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.