మహారాష్ట్రలో పులి పంజా విసిరింది.. ఓ చిన్నారిని బలి తీసుకుంది. చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి తాలుకా చిచ్‌గావ్‌ గ్రామంలో మంగళవారం రాత్రి పులి సంచరించింది. ఈ క్రమంలో ఒక ఇంటి వద్ద ఉన్న సురేంద్ర అనే ఐదేళ్ల బాలుడిని నోట కరచుకుని తీసుకెళ్లింది.

చిన్నారి అరుపులు, ఏడుపులు విన్న గ్రామస్తులు కర్రలు, బరిసెలు తీసుకుని పులిని వెంబడించారు. దీంతో ఊరి చివర మురుగు కాలువల కోసం తీసి గుంతలో చిన్నారిని వదిలి పారిపోయింది. అయితే పులి మెడ వద్ద కొరకడంతో ఆ బాలుడు అప్పటికే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే పులి బెడదను తొలగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గ్రామస్తులు బైఠాయించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.