మహారాష్ట్రలో ఓ ఐదేళ్ల బాలుడు పాడుబడ్డ బోరుబావిలో పడి మరణించాడు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఇతర యంత్రాంగం కనీసం తొమ్మిది గంటలు పడిన శ్రమంతా వృథా అయిపోయింది. 15 అడుగుల లోతులో బోరు బావిలో చిక్కుకున్న ఆ బాలుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయామని అధికారులు తెలిపారు. 

ముంబయి: మహారాష్ట్రలో ఐదేళ్ల బాలుడు వాడకంలో లేని బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడిని సజీవంగా బయటకు తీయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానికు పోలీసులు సంయుక్తంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. తొమ్మిది గంటలపాటు కష్టపడ్డా ఆ బాలుడి ప్రాణాలు దక్కలేవు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో బాలుడిని బయటకు తీయగలిగారు. కానీ, అప్పటికే ఆ బాలుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌‌లోని బుర్హన్‌పూర్‌కు చెందిన కుటుంబం మహారాష్ట్రకు వలస వచ్చింది. చెరుకు సాగు చేసే రైతు కొడుకే మృతి చెందిన ఐదేళ్ల సాగర్ బరేలా. కర్జత్ తహశీలులోని కొపర్దీ గ్రామంలో వారు నివసిస్తున్నారు.

సోమవారం సాయంత్రం వారు పొలం నుంచి ఇంటికి ఎడ్ల బండిపై వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎడ్ల బండి దిగిన తర్వాత కొంత సేపటికే సాగర్ బరేలా పాడుబడ్డ బోరుబావిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు.

Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా..

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక పోలీసులు, జిల్లా అధికార సిబ్బంది సంయుక్తంగా సాగర్‌ను ఆ బోరుబావిలో నుంచి ప్రాణాలతో బయటకు తీయడానికి ఎంతో కష్టపడ్డారు. బోరుబావిలోపల 15 ఫీట్ల అడుగులో బాలుడు చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. అతడిని రాత్రి రెండు గంటలకు బయటకు తీయగలిగారని వివరించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్టు పేర్కొన్నారు. 

బాలుడు మరణించడం బాధాకరమని కర్జత్ జంఖేడ్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. శాయశక్తుల ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయామని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో బోరుబావులను జాగ్రత్తగా కవర్ చేయాలని సూచించారు.