గులాబ్ జామ్ సిరప్ లో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. వేడి వేడి సిరప్ లో పడటంతో.. బాలుడు తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొంది కన్నుమూశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే....ఔరంగాబాద్ లోని పైథాన్ గేట్ వద్ద ఏదో శుభకార్యం నిమిత్తం వంటలు చేస్తున్నారు. అతిథులకు వడ్డించేందుకు గులాబ్ జామ్ లు కూడా తయారు చేస్తున్నారు.  పెద్ద పాత్రలో గులాబ్ జామ్ కోసం పంచదార పాకం తయారు చేస్తున్నారు. అటుగా రాజ్ వీర్ నితిన్ అనే రెండేళ్ల పిల్లాడు ఆడుకుంటూ వచ్చాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు.. వేడివేడిగా కాగుతున్న గులాబ్ జామ్ సిరప్ లో ప్రమాదవశాత్తు పడిపోయాడు.

ఆ సిరప్ వేడికి..బాలుడి శరీరం బాగా కాలిపోయింది. దీంతో.. వెంటనే స్పందించిన స్థానికులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలుడు.. ఆదివారం కన్నుమూశాడు. యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

అయితే.. బాలుడి మృతిపై అతని తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా ఎలా బాబు అందులో పడిపోతాడని ప్రశ్నిస్తున్నారు. బాబు పొరపాటున పడిపోయాడా..?లేక ఎవరైనా కావాలని పడేశారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు.