ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. దీనిని అరికట్టేందుకు దేశంలో పలుచోట్ల లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నారు. అయితే..  విధించిన కర్ఫ్యూ ని పాటించని వారి పట్ల పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఓ బాలుడు కర్ఫ్యూ పాటించకుండా బయటకు వచ్చాడనే కారణంతో.. ఇద్దరు పోలీసులు చితకబాదారు. ఫలితంగా ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావో జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉన్నావో జిల్లాకు చెందిన బంగారమౌ పట్టణానికి చెందిన 17ఏళ్ల మైనర్ బాలుడు తన ఇంటి ఎదురుగా కూరగాయలు అమ్ముతున్నాడు. కాగా.. కర్ఫ్యూ తర్వాత కూడా బయట ఉన్నాడని అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి.. దారుణంగా హింసించారు. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో..వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

 

కాగా.. బాలుడి మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసుల కారణంగానే తమ కుమారుడు చనిపోయాడంటూ వారు ఆరోపించారు. ఈ క్రమంలో.. బాలుడి మరణానికి కారణం చేస్తూ.. ఇద్దరు పోలీసులు, ఒక హోంగార్డును ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.