వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి దేశభక్తుడు కాలేడంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు.

అలాగే సోనియా గాంధీ దేశభక్తిని సైతం ప్రగ్యా ప్రశ్నించారు. ఈ గడ్డపై జన్మించిన వాడే దేశాన్ని కాపాడతాడు. ఒక విదేశీ వనితకు పుట్టినవాడు దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పాడని ఆమె గుర్తుచేశారు.

ఒకవేళ మీకు రెండు దేశాల్లో పౌరసత్వం వుంటే దేశభక్తి అనుభూతి ఎలా కలుగుతుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని.. ఎలా మాట్లాడాలో వారికి తెలియదంటూ ప్రగ్యా ఠాకూర్ ఎద్దేశా చేశారు.

నీతి, నైతికత, దేశభక్తికి ఆ పార్టీ దూరమని మండిపడ్డారు. కాగా గాల్వాన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణపై సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ స్పందించిన సంగతి తెలిసిందే.

ఆయుధాలు లేకుండానే జవాన్లను అక్కడికి పంపారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ వీరు మండిపడ్డారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా..? దాచివుంచడం దౌత్యనీతి కాదంటూ విమర్శలు కురిపించారు. దీంతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కాంగ్రెస్‌పై ప్రతి విమర్శలు చేశారు.