మాహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. నవాబ్ మాలిక్ ను మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో ఈడీ ఫిబ్రవరి 23వ తేదీన అరెస్టు చేసింది. ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు. 

మనీలాండరింగ్ (money laundering) కేసులో అరెస్టు అయిన మ‌హారాష్ట్ర మంత్రి, ఎన్ సీపీ నాయ‌కుడు నవాబ్ మాలిక్ (Nawab Malik)కు బాంబే హైకోర్టు (Bombay High Court) లో ఉప‌ష‌మ‌నం ల‌భించ‌లేదు. ఆయ‌న దాఖ‌లు చేసిన హెబియస్ కార్పస్ (habeas corpus) పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయ‌న మ‌రి కొంత కాలం పాటు క‌ష్ట‌డీలోనే ఉండ‌నున్నారు. 

పరారిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim), అతని సహాయకుల కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ ను ఫిబ్రవరి 23న ED అరెస్టు చేసింది. అయితే ఆయ‌న‌ను తొలుత ఈడీ కస్టడీకి పంపి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మంత్రి అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీ చట్టవిరుద్ధమని మాలిక్‌ తరపు న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ గత విచారణలో హైకోర్టుకు తెలిపారు. అరెస్ట్‌ను రద్దు చేసి, పక్కన పెట్టాలని, తాత్కాలిక ఉపశమనంగా వెంటనే కస్టడీ నుంచి విడుదల చేయాలని సీనియర్ న్యాయవాది డిమాండ్ చేశారు.

అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్, ఈడీ తరపున వాదించిన న్యాయవాది హితేన్ వెనెగోకర్ (Hiten Venegaokar) మాట్లాడుతూ.. మాలిక్‌ను సరైన ప్రక్రియ ప్రకారం అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. ప్రత్యేక పీఎమ్‌ఎల్ఏ (PMLA) కోర్టు జారీ చేసిన ఆయ‌న రిమాండ్ ఆర్డర్ అతనిని ఈడీ కస్టడీకి తరలించడానికి సరైన కారణాలను చూపింద‌ని కోర్టుకు చెప్పారు. కాగా.. మంత్రి నవాబ్ మాలిక్ దాఖ‌లు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ (అక్ర‌మంగా అరెస్టు చేసిన వ్య‌క్తిని న్యాయస్థానం లేదా న్యాయమూర్తి ఎదుట‌కు తీసుకురావ‌డానికి జారీ చేసే రిట్ ) స‌రైంద‌ని కాద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేసులో మంత్రి రెగ్యులర్ బెయిల్ కోరాలని కూడా ఆయ‌న సూచించారు.

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్ మరియు ఇతరులపై నమోదైన కేసులో ఈడీ నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసి విచారిస్తోంది. గత నెలలో ఈ కేసుకు సంబంధించి దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంతో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు జరిపారు. అలాగే హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. 

నవాబ్ మాలిక్ మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ఆయ‌న ఎన్సీపీ అధినేత శరద్ పవర్ (sharad pawar)కు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేసిన వెంట‌నే శ‌రద్ ప‌వ‌ర్ స్పందించారు. బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే మాలిక్‌ను అరెస్టు చేశారని ఆయ‌న ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ (bjp) ప్ర‌భుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంద‌ని అన్నారు. న‌వాబ్ మాలిక్ కేంద్రాన్ని బ‌హిరంగంగా విమ‌ర్శించార‌ని, అందుకే ఆయ‌నను అరెస్టు చేశార‌ని తెలిపారు. ఇలా విమర్శ‌లు చేస్తే వేధింపులు ఉంటాయ‌ని త‌మ‌కు ముందే తెలుస‌ని చెప్పారు. ఏదో ఒక రోజు ఇలాంటిది జ‌రుగుతుంద‌ని తాము ఊహించామ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ సంస్థ‌ల‌ను త‌మ స్వార్థం కోసం ఉప‌యోగించుకుంటోంద‌ని ఆరోపించారు.