Asianet News TeluguAsianet News Telugu

తబ్లిగీ జమాత్: విదేశీయులను బలి పశువుల్ని చేశారు.. ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది

Bombay High Court quashes case against foreign attendees
Author
Aurangabad, First Published Aug 22, 2020, 10:15 PM IST

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. తీర్పు సందర్భంగా జస్టిస్ నాలావాడే ఎంజీ సెవ్లికర్లతో కూడిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మార్చిలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ పౌరులను బలి పశువుల్ని చేశారని... దేశంలో కరోనా వ్యాప్తికి వారు కారణమయ్యారంటూ అనవసర ప్రచారం జరిగిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  

ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని, రాజకీయ బలవంతంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే వీరిపట్ల సోషల్ మీడియాలో సైతం తప్పుగా ప్రచారం చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా దేశంలో కరోనా వ్యాప్తికి వీరు కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

మరోవైపు పర్యాటక వీసా అనుమతులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మంది విదేశీయులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు తబ్లిగీ జమాత్ కార్యక్రమం దాదాపు ఐదు దశాబ్ధాలుగా కొనసాగుతోందని బెంచ్ అభిప్రాయపడింది.

అతిథులను స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కతిని భారదేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విదేశీయులపై ఇటువంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని పేర్కొంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ధర్మాసనం హెచ్చరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios