బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభ వేదికకు సమీపంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటన బిహార్‌లో నలందలో చోటుచేసుకుంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభ వేదికకు సమీపంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటన బిహార్‌లో నలందలో చోటుచేసుకుంది. నలందలో జరుగుతున్న జనసభలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. జనసభ వేదికకు సమీపంలో ఓ దుండగుడు బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇక, పేలుడు శబ్దానికి సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే నితీష్ కుమార్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇక, నితీష్ కుమార్ భద్రతలో భారీ లోపం జరగడం 15 రోజుల్లో ఇది రెండోసారి. మార్చి 27న నితీష్ కుమార్‌పై శంకర్ కుమార్ వర్మ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డారు. పట్నాకు సమీపంలోని తన సొంత ఊరు Bakhtiyarpurలోని ఆస్పత్రి ప్రాంగణంలో స్వాతంత్ర్య సమరయోధుడు షిల్‌భద్ర యాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నితీష్ హాజరై.. విగ్రహానికి పూల వేసి నివాళులర్పిస్తుండగా.. వేదికపైకి వచ్చిన ఓ యువకుడు సీఎం వీపుపై కొట్టాడు. దీంతో వెంటనే నితీష్ కుమార్ భద్రత సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసింది. ఈ క్రమంలోనే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. వైద్య సాయం అందించాలని నితీశ్ కుమార్ అధికారులకు చెప్పారు.
ఇక, తాజాగా మంగళవారం(ఏప్రిల్ 12) సీఎం పాల్గొన్న సభకు సమీపంలో బాంబు దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో సెక్యూరిటీ మధ్య ఉండే సీఎం భద్రతలో వరుసగా ఇలాంటి లోపాలు చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
