Asianet News TeluguAsianet News Telugu

సెలవు పెట్టి ఎంజాయ్ చేయండి సార్.. ప్రధానికి బర్త్ డే విషెస్‌లో షారూఖ్ ఖాన్ ఏమన్నారంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. ప్రధాని నరేంద్ర మోడీకి బర్త్ డే విషెస్ చెప్పారు. దేశం కోసం ఆయన చూపిస్తున్న నిబద్ధత ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అలాగే, బర్త్ డే కాబట్టి సెలవు తీసుకుని ఎంజాయ్ చేయాలని అభిప్రాయపడ్డారు.
 

bollywood star shah rukh khan wishes pm modi, says take day off and enjoy
Author
First Published Sep 17, 2022, 5:31 PM IST

ముంబయి: భారత ప్రధాని నరేంద్ర మోడీ 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజును పురస్కరించుకుని పలు దేశాల అధినేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలోనూ అనేక రంగాల్లో నిపుణులైన వారు.. ప్రముఖులు, సెలెబ్రిటీలు విషెస్ చెప్పారు. ఈ సెలెబ్రిటీల్లో షారూఖ్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయన చేసిన విషెస్ కొంత స్వీట్‌గానూ.. మరికొంత ట్విస్టీగానూ ఉన్నది.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్.. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రధానికి ఉన్న నిబద్ధత ప్రశంసనీయం అని షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. మీ లక్ష్యాలు సాధించడానికి మీకు ఆరోగ్యం, బలం చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మీ పుట్టిన రోజున సెలవు తీసుకుని ఎంజయ్ చేయండి సార్ అంటూ పేర్కొన్నారు. హ్యాపీ బర్త్ డే అంటూ నరేంద్ర మోడీ ట్విట్టర్ అకౌంట్ ట్యాగ్ చేశారు.

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసుకు సంబంధించి ఆయన కొన్నాళ్లు తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకకున్న ఆ కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అప్పటి ఎన్‌సీబీ అధికారి వాంఖెడ్ కావాలనే కుట్ర చేశారని, పెద్ద మొత్తంలో డబ్బు గుంజడానికి ఈ పని జరిగిందని ఆ తర్వాత పరిణామాల్లో పలువురు ఆరోపణలు చేశారు. అప్పుడు షారూఖ్ ఖాన్‌పై కొందరు బీజేపీ అనుకూలురు విమర్శలు కూడా చేశారు. కానీ, ఎట్టకేలకు ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు నుంచి బయటపడ్డారు. తాజాగా, షారుఖ్ ఖాన్ ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

సెలెబ్రిటీలు ఏది చేసినా చాలా మంది అందులో తమవైన అభిప్రాయాలు వెతుక్కుంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతున్నది. షారూఖ్ ఖాన్ చెప్పిన బర్త్ డే విషెస్‌లోనూ కొందరు ఓ చిన్నపాటి అసంతృప్తిని సోషల్ మీడియాలో బయటపెట్టుకున్నారు. ప్రధాని మోడీని సెలవు తీసుకోమని ఎంజాయ్ చేయమనడాన్ని వారు అభ్యంతరంగా భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios