నటుడు వరుణ్ ధావన్ తన అభిమానికి సహాయ హస్తం అందించడానికి ముందుకు వచ్చారు. తను, తన తల్లి కుటుంబహింసకు గురవుతున్నామంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ కు స్పందించారు.
‘జుగ్ జుగ్ జియో’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న వరుణ్ ధావన్ కు ఓ అభిమాని ట్వీట్ చేసింది. తను, తన తల్లిని తండ్రి గృహహింసకు గురిచేస్తున్నాడని సహాయం చేయాల్సిందిగా కోరింది. తన తండ్రి తనను, తన తల్లిని కొడుతూ, తిడుతూ హింసిస్తున్నాడని పేర్కొంది. తమను కనీసం ఆహారం కూడా తిననివ్వడని.. ఎప్పుడూ బూతులు తిడుతుంటాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఏం ట్వీట్ చేసిందంటే.. రెస్పెక్టెడ్ సార్, నన్ను, మా అమ్మను నాన్న హింసిస్తున్నాడు. ప్రతిరోజూ కొడుతూ, తిడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. రోజుల తరబడి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. బూతులు తిడుతూ, శాపనార్థాలు పెడుతున్నాడు.. అని చెప్పుకొచ్చింది.
అంతేకాదు.. తాను సహాయం కోసం మొదట గుజరాత్ పోలీసులను ఆశ్రయించానని, తండ్రికి వ్యతిరేకంగా రుజువులను చూపించానని చెప్పుకొచ్చింది. అయితే, పోలీసులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తన ట్వీట్‌తో, సమస్యను పరిశీలించి తనకు సహాయం చేయవలసిందిగా అధికారులను, నటుడిని అభ్యర్థించింది.
ఈ ట్వీట్ వరుణ్ దృష్టిని ఆకర్షించింది. త్వరలో ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని అతను అభిమానికి హామీ ఇచ్చాడు. అతను ఇలా వ్రాశాడు, "ఇది చాలా తీవ్రమైన విషయం.. మీరు చెప్పేది నిజమైతే నేను మీకు సహాయం చేస్తాను. అధికారులతో మాట్లాడతాను" అంటూ స్పందించాడు. దీనికి ఆ అమ్మాయి చాలా సంతోషించింది. తన ట్వీట్‌కు వరుణ్ ప్రతిస్పందనపై ఆమె ప్రతిస్పందిస్తూ.. చాలా థాంక్స్ వేదే (వరుణ్ దావన్) నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను" అని ట్వీట్ చేసింది.
ఇలా సహాయం చేయమంటూ అమ్మాయి చేసిన ట్వీట్ కు వరుణ్ వేగంగా స్పందించడం అతని అభిమానులను ఆకట్టుకుంది. దీంతో అభినందనలతో రీ ట్వీట్లు చేస్తున్నారు అభిమానులు. ‘మీ దాతృత్వంతో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు’. ‘మీ వల్ల అమ్మాయికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’.. ‘సమాజానికి మీలాంటి వ్యక్తులే కావాలి’ అంటూ పలురకాలుగా వరుణ్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. కియారా అద్వానీ, నీతూ కపూర్, అనిల్ కపూర్‌లతో పాటు వరుణ్ జగ్‌జగ్ జీయో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 24న థియేటర్లలోకి రానుంది. జగ్‌జగ్ జీయోతో పాటు, వరుణ్ జాన్వీ కపూర్‌తో, బావాల్, కృతి సనన్‌లతో భేడియా
సినిమా కూడా లైన్లో ఉంది.
