కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందో కూడా అర్థం కావడం లేదు. తాజాగా.. ఓ వ్యక్తి కరోనా వైరస్ తో మృతి చెందాడు. రోడ్డు మీదే కుప్పకూలిపోయాడు. అయితే... కనీసం  అతని మృతదేహం దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 బెంగళూరుకు చెందిన ఓ 64 వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో శుక్రవారం అతడికి గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే అంబులెన్స్‌ కోసం కాల్‌ చేశాడు. పరిస్థితి వివరించి.. తమ ఇంటి దగ్గరకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. అంబులెన్స్‌ కోసం రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గ మధ్యలోనే గుండెపోటుతో రోడ్డు మీదే కుప్పకూలాడు. 

అలా మూడు గంటల పాటు ఆ వృద్ధుడి మృతదేహం రోడ్డు మీదనే ఉంది. ఆ తర్వాత అంబులెన్స్‌ అక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లింది. దీని గురించి మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘కరోనా అని తెలిస్తే... ఇరుగుపొరుగు వారు భయపడతారనే ఉద్దేశంతో నా భర్త ఎవరి సాయం తీసుకోలేదు. అంబులెన్స్‌కు కాల్‌ చేసి రమ్మని చెప్పాడు. రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు.

ఈ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బృహన్‌ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ)పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు.