మరో పరువు హత్య కలకలం రేపింది. నవ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలోని హోసూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హోసూరు-బేరికె రహదారిలోని వెంకటేషపురం చూడగొండపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నందీశ్‌(25) హోసూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా పని చేసేవాడు. హోసూరులోనే నివాసం ఉంటూ స్థానిక యువతి స్వాతి(21)ని ప్రేమించాడు. 

కులాలు వేరైనందున స్వాతి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను తిరస్కరించారు. కాగా.. వీరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి మూడు నెలలు గడుస్తుండగా.. సడెన్ గా కొద్ది రోజుల క్రితం వీరు అదృశ్యమయ్యారు. ఈ విషయమై నందీశ్‌ సోదరుడు శంకర్‌ హోసూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టరు లక్ష్మణదాస్‌ కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

అదృశ్యమైన నవ దంపతులు కర్ణాటకలోని మండ్య జిల్లా మారుమూలన ఉన్న మల్లహళ్ళి శివారులోని కావేరి నదిలో విగతజీవులుగా కనిపించారు. వీరు హత్యకు గురైనట్లు మండ్య పోలీసులు కేసు నమోదు చేసి హోసూరు పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. వీరిని వేరేచోట దారుణంగా హతమార్చి కాళ్లు, చేతులను తాడుతో కట్టి నదిలో విసిరేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాలను కావేరి నది నుంచి వెలికి తీసి నవదంపతులు నందీశ్‌, స్వాతిగా గుర్తించారు.

స్వాతి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుందనే కారణంతోనే.. వారిని చంపినట్లు స్వాతి తండ్రి అంగీకరించినట్లు సమాచారం.