మహారాష్ట్ర బీచ్‌కు ఏకే 47 గన్లు, ఆయుధాలతో ఓ బోట్ కొట్టుకు వచ్చింది. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఈ బోట్ రావడం కలకలాన్ని రేపింది. రాష్ట్ర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ముంబయి: మహారాష్ట్రలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారా? అందుకోసం ఆయుధాలు వేరే దేశం నుంచి సముద్ర మార్గం ద్వారా పంపించాలని ప్లాన్ చేశారా? ఇప్పుడు మహారాష్ట్రలో ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఓ బోట్ అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర తీరానికి కొట్టుకు వచ్చింది. అందులో ఏకే 47 గన్‌లు, బుల్లెట్లు, ఇతర ఆయుధ పరికరాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
గణేశ్ ఉత్సవాలు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ముందే ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఓ బోట్‌లో రాష్ట్ర తీరానికి కొట్టుకు రావడం సంచలనంగా మారింది. ఈ బోట్ మహారాష్ట్ర రాయ్‌గడ్ జిల్లాకు చెందిన హరిహరేశ్వర్ బీచ్‌కు కొట్టుకు వచ్చింది.
ముంబయి నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్‌కు అనుమానాస్పద స్థితిలో ఓ బోట్ కొట్టుకు వచ్చింది. స్థానికులు ముందుగా ఈ బోట్‌ను చూశారు. ఆ బోట్‌లో ఎవరూ లేరు. ఖాళీ బోట్ కొట్టుకు వస్తుండటంపై అనుమానాలు వచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. రాయ్‌గడ్ జిల్లా ఎస్పీ అశోక్ దుదే, ఇతర సీనియర్ అధికారులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. బోట్‌ను సెర్చ్ చేశారు.
ఆ పడవ అలలకు కొట్టుకుంటూ బీచ్‌కు వచ్చిందని పోలీసులు తెలిపారు. అందులో కొన్ని డిస్మాంటిల్ చేసిన ఆయుధాలు కూడా ఉన్నాయని ఇతర అధికారులు వివరించారు.
ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని, ఇందులో ఉగ్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని ఏటీఎస్ చీఫ్ వినీత్ అగర్వాల్ తెలిపారు. ఈ బోట్ ఒమన్‌లో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తున్నదని వివరించారు. ఇది వదిలిపెట్టిన బోట్‌గా తెలుస్తున్నదని కూడా చెప్పారు. పడవలకు సెక్యూరిటీ ఇచ్చే నెప్ట్యూన్ మేరీటైమ్ సెక్యూరిటీ లిమిటెడ్‌కు చెందినదని పోలీసు వర్గాలు వివరించాయి. త్వరలోనే ఈ సంస్థ ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై స్పందించారు. ఇది ఆస్ట్రేలియ పౌరుడు హనా లాండర్గన్‌కు చెందినదని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివరించారు.
