కోటి మంది బిజెపి తో కుమ్మక్కయ్యారా..! మీ కాంగ్రెస్ వాళ్లు కూడానా..!!: కపిల్ సిబల్ కు అఖిలేశ్ మిశ్రా కౌంటర్
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు ఈవిఎంలు, ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలపై అఖిలేశ్ మిశ్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...
న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశల్లో 486 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది... కేవలం మరో దశ పోలింగ్ మాత్రమే జరగాల్సి వుంది. వచ్చే నెల జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇలా లోక్ సభ ఎన్నికలు క్లైమాక్స్ చేరుకున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఈసి, ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 17C ఫారం అప్ లోడ్ చేయడంలేదని... ఎన్ని ఓట్లు పోలయ్యాయో కూడా చెప్పడంలేదంటూ సీనియర్ నాయకులు కపిల్ సిబల్ వంటివారు ఈసిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నాయకులకు బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా దీటుగా సమాధానం చెప్పారు.
కాంగ్రెస్ కు అఖిలేశ్ మిశ్రా కౌంటర్ :
ఎన్నికల సంఘం, ఈవిఎంలపై కాంగ్రెస్ నాయకుల అనుమానాలు లాజిక్ లేకుండా వున్నాయని అఖిలేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆరు దశల్లో లోక్ సభ పోలింగ్ ముగిసింది... ఆ ఢాటాను ఒకసారి పరిశీలించాలని ఆయన సూచించారు. ఆరు దశల్లో 486 లోక్ సభ స్థానాల్లోని దాదాపు 9 లక్షల పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకున్నారని ఈసి లెక్కలు చెబుతున్నాయి. ప్రతి లోక్ సభ స్థానంలో రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి రెండంకెల సంఖ్యలో వుంటారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ లో అభ్యర్థి తరపున ఏజెంట్లు వుంటారు. ఒక్కోసీటుకు కనీసం పదిమంది అభ్యర్థులను లెక్కేసుకున్నా వారి తరపున ఒక్కో పోలింగ్ బూత్ లో ముగ్గురు ఏజెంట్ వుంటారు. అంటే 9 లక్షల పోలింగ్ స్టేషన్లంటే 90 లక్షల మంది ఏజెంట్లు వుంటారని అఖిలేశ్ మిశ్రా వివరించారు.
అయితే స్వతంత్ర అభ్యర్థులు పోలింగ్ ఏజంట్లను ఏర్పాటు చేయలేకపోయినా... రాజకీయ పార్టీలు కూడా ఒక్కో పోలింగ్ బూత్ లో ఒక్కో అభ్యర్థినే ఏర్పాటుచేసారని అనుకుందాం. ఇలా మూడు ప్రధాన పార్టీల తరపున ముగ్గురు ఏజెంట్లే వున్నారని అనుకుందాం. అయినా 9 లక్షల పోలింగ్ స్టేషన్లలో 27 లక్షల మంది ఏజెంట్స్ వుంటారు. అంటే అభ్యర్థులు కాకుండా లక్షలాది మంది ఏజంట్లు పోలింగ్ సరళిని దగ్గరుండి పరిశీస్తారు... అవకతవకలు జరగకుండా చూస్తారని అఖిలేశ్ మిశ్రా తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ వాదనను వింటుంటే ఈ పోలింగ్ ఏజెంట్స్ అందరూ బిజెపితో కుమ్మక్కయారు అనేలా వున్నాయని అఖిలేశ్ మిశ్రా పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, వారి తరపున పనిచేసిన పోలింగ్ ఏజెంట్స్ కు మోదీ, బిజెపి కుట్రలో భాగమేనా అంటూ ప్రశ్నించారు. దాదాపు కోటి మంది పోలింగ్ ఏజెంట్స్ తో బిజెపి కుమ్మక్కయినట్లు ఆధారాలేమైనా వున్నాయా? అది ఎలా సాధ్యపడుతుందో చెప్పాలని కపిల్ సిబల్ వంటి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు అఖిలేశ్ మిశ్రా.