బక్రీద్‌కు కొత్త రకం కుర్బానీ.. ముస్లిం సత్యశోధక్ మండల్ సైంటిఫిక్ అప్రోచ్
బక్రీద్‌కు ముస్లిం సత్యశోధక్ మండల్ కొత్త రకం కుర్బానీ పాటిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా 13 ఏళ్లుగా వారు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ: బక్రి ఈద్ లేదా ఈద్ ఉల్ అజా సందర్భంగా ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ సంప్రదాయం గత 13 ఏళ్లుగా ఆచరిస్తున్నది. ఈ శిబిరంలో రక్తదానం చేయడానికి కులాలు, మతాలకు అతీతంగా దాతలు వస్తారు. మత వేడుకలకు సామాజిక ప్రాసంగికతను జతచేయడమే ఈ ముస్లిం సత్యశోధక్ మండల్ లక్ష్యం.
ఈ ఏడాది కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ భావసారూప్యత గల ఇతర సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నది. గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఈ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత స్థాయి నుంచి సంఘాల స్థాయి వరకు పూనెలోని రాష్ట్ర సేవా దల్ నిర్వహిస్తున్నది.
నాథ్ పాయ్ ఆడిటోరియంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌ను ముస్లిం కమ్యూనిటీ స్వాగతిస్తున్నది.
ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణాలను ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షుడు డాక్టర్ శంశుద్దీన్ తంబోలి వివరించారు. ‘ముహమ్మద్ ప్రవక్త మానవాళి సంక్షేమం కోసం అప్పటి పరిస్థితులకు లోబడి ఇస్లాంను స్థాపించారు. నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని మతాల వేడుకలను మానవాళి కేంద్రంగా నిర్వహించి.. తద్వార రాజ్యాంగం చెబుతున్న కనీస పౌర బాధ్యతలను నెరవేర్చాలని అనుకుంటున్నాం’ అని తెలిపారు.
‘భారత్‌లో హిందూ, ముస్లింలు సామరస్యంగా కలిసి జీవించే సంస్కృతి ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. బక్రీద్‌నే ఈద్ కుర్బానీగా కూడా అంటారు. అంటే త్యాగం అని అర్థం. రక్తం మానవ దేహంలోని అంతర్భాగం. కులం, మతం, లింగం, ప్రాంతాలకు అతీతంగా రక్తదానం త్యాగానికి నిదర్శనంగా ఉంటుంది. ఇది మానవత్వాన్ని పెంపొందిస్తుందని, ఇదే తమ కార్యక్రమాల లక్ష్యం’ డాక్టర్ శంశుద్దీన్ తంబోలి అని వివరించారు.
గంగా జముని వంటి ఐక్య సంస్కృతిని, దేశ సామాజిక ప్రజాస్వామ్యాన్ని, శాస్త్రీయ దృక్కోణం, రాజ్యాంగాన్ని వేడుక చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన శ్రీరూప భగవాన్ మాట్లాడుతూ.. ముస్లిం సత్యశోధక్ మండల్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో గత ఆరేళ్లుగా తాను రక్తదానం చేస్తున్నట్టు చెప్పారు. అందరం ఇందులో పాల్గొని రక్తదాతల సంఖ్యను పెంచుదామని, ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లుదామని అన్నారు.
Also Read: పగబట్టిన పాము! మొదటిసారి కాటేస్తే ట్రీట్‌మెంట్, నిలిచిన ప్రాణాలు.. రెండో సారి కాటేయడంతో వ్యక్తి మృతి
రక్తదాన శిబిరంతోపాటు ఈ కార్యక్రమంలో అవయవ, బాడీ డొనేషన్ ఫెడరే షన్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ దేశ్‌పాండే.. ‘అవయవ దానం- పోస్టుమార్టం బాడీ దానం’ అంశంపై ప్రసంగించారు. ముస్లిం సత్యశోధక్ మండల్ కార్యనిర్వాహక సభ్యులు సమీనా పఠాన్ రాసిన సైంటిఫిక్ అప్రోచ్ అమాంగ్ స్కూల్ స్టూడెంట్స్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.
ఈ కార్యక్రమాలకు ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షుడు డాక్టర్ శంశుద్దీన్ తంబోలి అధ్యక్షత వహించారు. కాగా, మహారాష్ట్ర మాజీ ఏడీజీపీ అశోక్ ధివారే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
---ఛాయ కవిరె