మామూలుగా అయితే.. పోయిన సొమ్ము దొరకదు. రోడ్డు మీద రూపాయి కనపడినా.. అయ్యో ఇది ఎవరిది అని అడిగేవారు ఈరోజుల్లో ఎవరూ లేరు. వెంటనే తీసుకొని జేబులో వేసుకొని అక్కడి నుంచి చెక్కేసేవారే ఎక్కువ. అలాంటి రోజుల్లోనూ ఓ వ్యక్తికి తాను పోగొట్టుకున్న దాదాపు రూ.20వేల రూపాయిలు తిరిగి అతనికి దక్కాయి. అంతా కరోనా మాయ అని సదరు వ్యక్తి సంబర పడటం గమనార్హం. ఈ సంగటన బిహార్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సహర్ష జిల్లాకు చెందిన గజేంద్ర షా(29) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను పోగొట్టుకున్న 20,500 రూపాయలను అనూహ్యంగా తిరిగి పొందగలిగాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శనివారం ఉదయం ఐదున్నరకే లేచి టిన్‌షెడ్‌ కొనేందుకు 25 వేల రూపాయలు తీసుకుని మహువా బజార్‌కు బయలుదేరాడు. మార్కెట్‌ చేరడానికి కొంచెం దూరం ముందు తన జేబు నుంచి రూ.20,500 పోయినట్టు గుర్తించాడు. 

తన జేబులో నుంచి పొగాకు తీస్తుండగా డబ్బు పడిపోయిందని బాధితుడు చెప్పాడు. అయితే.. తాను ఆటో దిగి చాలా దూరం రావడంతో.. ఇక పోయిన డబ్బు తిరిగి దొరకే అవకాశం లేదని వదిలేసుకున్నాడు.

రెండు నెలల తన సంపాదన పోయిందన్న దిగులుతో ఇంటికి తిరిగి వచ్చాడు. కరోనా వైరస్‌ సోకుతుందన్న భయంతో రోడ్డుపై పడిన నగదును ఎవరూ తీసుకోకపోవడంతో ఉడాకిషన్‌గంజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఫేస్‌బుక్‌తో తిరుగున్న వార్తను పొరుటింటాయన గజేంద్రకు చూపించాడు. వెంటనే గజేంద్ర పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన డబ్బును తిరిగి దక్కించుకున్నాడు. 

‘రోడ్డుపై డబ్బులు పడివున్నాయని, కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు కావాలనే ఎవరో నగదు పడేశారని మాకు చాలా మంది ఫోన్‌ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బు తనదేనంటే గజేంద్ర రావడంతో వివరాలన్ని కనుక్కుని అతడికి ఇచ్చేశామన’ని ఉడాకిషన్‌గంజ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శశిభూషణ్‌ సింగ్‌ తెలిపారు.