సారాంశం

ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధాన్ని ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గతేడాది తమ ఆదేశాలు విస్పష్టంగా ఉన్నాయని, అవే ఈ ఏడాది కూడా యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఫైర్ క్రాకర్స్ విక్రయించడం, కొనుగోలు చేయడం, పేల్చడంపై నిషేధం యథావిధంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఢిల్లీలో బాణా సంచాపై నిషేధాన్ని ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్‌ను నిషేధించబోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తమ ఆదేశం స్పష్టంగా ఉన్నదని వివరించింది.

ఢిల్లీ ఎన్సీఆర్‌లో కాలుష్య తీవ్రతపై ఆందోళన చెందుతూ సోమవారం సుప్రీంకోర్టు ఈ మేరకు తెలిపింది. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వేసిన పిటిషన్ పై విచారిస్తూ ఈ మేరకు స్పష్టం చేసింది. ఢిల్లీలో గతేడాది ఫైర్ క్రాకర్స్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఫైర్ క్రాకర్స్ అమ్ముతూ కనిపించిన వారిపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ నిషేధం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రజలు భయాందోళనలకు గురవుతారని పేర్కొన్నారు.

Also Read: అక్కడ పీల్చే గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఫైర్ క్రాకర్స్ బ్యాన్‌కు సంబంధించి తమ ఆదేశాలు విస్పష్టమైనవని తెలిపింది. అవి గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ వాటిని ఎలా అనుమతించగలం అని వివరించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని మీరు చూశారా? అంటూ పిటిషనర్‌ను అడిగింది. దీపావళి తర్వాత ఢిల్లీ, ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని తెలిపింది. పరిస్థితులు దారుణంగా మారుతాయని పేర్కొంది.

ఈ ఆదేశాలతో ఢిల్లీలో దీపావళి, ఛత్త్ పుజా, గురునానక్ జయంతి, నూతన సంవత్సర వేడుకలకూ ఫైర్ క్రాకర్స్ పై నిషేధం కొనసాగుతుందని స్పష్టమైంది.