Sanjay Raut On PM Modi: భార‌త‌ ప్రధాని న‌రేంద్ర మోడీ కాళ్లను పపువా న్యూగినియా పీఎం తాకడంపై శివ‌సేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌ధాని మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌త్ నుంచి ఒక మాంత్రికుడు వచ్చాడని భావించి ఉంటాడనీ, అందుకే మోడీ పాదాలను తాకి ఉంటాడ‌ని విమ‌ర్శించారు.

Shiv Sena (UBT) MP Sanjay Raut: ఆదివారం (మే 21) పపువా న్యూగినియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి విమానాశ్రయంలో ఆ దేశపు పీఎం జేమ్స్ మార్పే స్వాగతం పలికారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్రధాని మోడీ కాళ్ల‌ను తాకారు. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పపువా న్యూగినియా ప్రధాని.. భారత్ నుంచి ఓ మాంత్రికుడు వచ్చాడని భావించి ఉంటారంటూ ప్ర‌ధాని మోడీని శివసేన నాయ‌కుడు సంజయ్ రౌత్ టార్గెట్ చేశారు. ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. "ఏదో పెద్ద మాంత్రికుడు భారతదేశం నుండి వచ్చాడనీ, అతను వారికి మ్యాజిక్ నేర్పుతాడని వారు భావించారు, కాబట్టి వారు అతన్ని అలా పలకరించారు" అని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మార్పే ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకడంపై సంజయ్ రౌత్ సోమవారం స్పందించారు.

మూడు దేశాల పర్యటనలో ప్రధాని మోడీ 

పపువా న్యూగినియా దేశ చరిత్రను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అన్నారు. దేశం మొత్తం మాయాజాలంతో నిండిపోయింది. దేశంలో ప్రజలు చాలా బ్లాక్ మ్యాజిక్ ఆచరిస్తారు. ఏదో పెద్ద మాంత్రికుడు ఇండియా నుంచి వచ్చాడనీ, అతను తమకు మ్యాజిక్ నేర్పుతాడని వారు భావించారు, అందుకే వారు అతన్ని అలా కాళ్ల‌పై ప‌డుతూ ప‌ల‌క‌రించార‌ని విమ‌ర్శించారు. 

పపువా న్యూ గినియా చరిత్రను బీజేపీ తెలుసుకోవాలి..

గతంలో జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు వారి పాదాలను కూడా తాకేవారు. భారతీయ జనతా పార్టీకి పపువా న్యూ గినియా చరిత్ర తెలియాలి. ఆ దేశ జనాభా 80 లక్షలు, అక్కడ 850 భాషలు మాట్లాడతారు. ఒకదానితో ఒకటి సంబంధం లేని ద్వీపాలు చాలా ఉన్నాయి. ఆ దేశ ప్రజలు బ్లాక్ మ్యాజిక్ ను నమ్ముతారు కాబట్టి మోడీని గౌరవించాలని భావించి ఉంటారు అంటూ విమ‌ర్శించారు.

జయంత్ పాటిల్ తలవంచడు: సంజయ్ రౌత్

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరైన నేపథ్యంలో ఆయనపై కుట్ర జరుగుతోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆయన ఆత్మగౌరవం ఉన్న నాయకుడని, ఆయన తలవంచరని అన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ విచారిస్తున్నారని సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జయంత్ పాటిల్ ను ఈడీ విచారిస్తోంది. అయితే, దీని వెనుకు రాజ‌కీయ క‌క్షసాధింపు కూడా ఉంద‌ని తెలిపారు.