ఉత్తరప్రదేశ్‌ను బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు 73 అరుదైన ‘బ్లాక్ ఫంగస్’ ఇన్‌ఫెక్షన్ కేసులు కోవిడ్ -19 రోగులలో బయటపడ్డాయి. వీటిలో గరిష్టంగా వారణాసిలో బయటపడ్డాయి. 

ఇప్పటివరకు వారణాసిలో 20, లక్నో 15, గోరఖ్‌పూర్‌లో 10, ప్రయాగ్రాజ్‌లో ఆరు, గౌతమ్ బుద్ధ నగర్‌లో ఐదు, మీరట్‌లో నాలుగు, కాన్పూర్, మధుర, ఘజియాబాద్‌లో మూడు కేసులు, ఆగ్రాలో ఒక కేసు నమోదయ్యాయి. 

బ్లాక్ ఫంగస్ కారణంగా కాన్పూర్‌లో ఇద్దరు కోవిడ్ -19  రోగులు మరణించారు. కాగా మధురాలో ఇద్దరు, లక్నోలో ఒకరు బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయారు.

ఈ  ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 14 మంది ఆరోగ్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.  ప్రారంభ దశలోనే బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని అదుపుచేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత ప్రాతిపదికన పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను కోరారు. 

నివారణ, జాగ్రత్తలు, చికిత్సకు సంబంధించిన వివరణాత్మక నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయానికి క్రమం తప్పకుండా సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు తెలిసింది.

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వైద్యులు మూడు నెలల్లో కనీసం ఏడు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మెడికల్ యూనివర్సినీ కాలేజ్ లోని కోవిడ్ ఐసియు వార్డులో నలుగురు రోగులు ఇంకా బ్లాక్ ఫంగస్ వ్యాధినుంచి కోలుకుంటున్నారని వారు తెలిపారు.

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు చెబుతూ.. ‘కళ్ళు, ముక్కు చుట్టూ నొప్పి, ఎరుపు, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, రక్త వాంతులు,  సెన్సోరియంలో మార్పులు" లాంటివి కనిపిస్తాయని మెడికల్ సూపరింటెండెంట్, అంటు వ్యాధుల విభాగానికి ఇన్‌చార్జి డాక్టర్ డి హిమాన్షు చెప్పారు.

కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం స్టెరాయిడ్స్‌పై ఉన్న రోగులలో, రోగనిరోధక శక్తిని తగ్గడం వల్ల.. బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురవుతున్నారని ఆయన చెప్పారు.

ముకోర్మైకోసిస్ గా పిలవబడే 'బ్లాక్ ఫంగస్' ఇన్ఫెక్షన్ తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారిలో దీర్ఘకాలిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో ఉన్న COVID-19 రోగులలో కనిపిస్తుందని దీన్ని సరిగా చికిత్స చేయకపోతే ప్రాణాంతకమవుతుందని ఆదివారంనాడు కేంద్రం హెచ్చరించింది.