Manish Sisodia: బుల్డోజ‌ర్ రాజ‌కీయాల‌కు తెర‌లేపిన బీజేపీ.. ఢిల్లీని నాశ‌నం చేసేందుకే ఇలా చేస్తోంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన కౌన్సిలర్లకు కూడా నోటీసులు జారీ చేయాలని, అవినీతితో డబ్బు సంపాదించిన‌వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా డిమాండ్ చేశారు. 

BJP vs AAP: అక్రమ ఆక్రమణల కూల్చివేత పేరుతో భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) బుల్డోజర్ రాజకీయాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. బీజేపీ చేస్తున్నబుల్డోజర్ రాజకీయాలు దేశానికి నష్టం చేకూరుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతూ.. డబ్బుల దండుకునే చర్యలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపిస్తోంది. బీజేపీ తీరుపై ఆమ్ ఆద్మీ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూల్చివేతల విషయంలో ముందుగా అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కౌన్సిలర్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

'50 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్న 1,750 అక్రమ కాలనీలకు నోటీసులు జారీ చేశాం. ఇదీ బుల్‌డోజర్‌ రాజకీయం. ఇంత మందిని నిరాశ్రయులను చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. దీంతోపాటు లక్షకు పైగా జనాభా ఉన్న జేజే క్లస్టర్‌లోని 860 కాలనీలకు నోటీసులు జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీ మొత్తం నాశనం అవుతుంది' అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా కూల్చివేతల నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విమర్శలు మరింతగా పెంచింది. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది. మొదట ఢిల్లీలో అక్రమ నిర్మాణాలను అనుమతించిన కౌన్సిలర్‌లకు కూడా నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేసింది. 

సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో గత 17 సంత్సరాల బీజేపీ పాలనలో కౌన్సిలర్లు, ఇంజనీర్లు అవినీతితో సొమ్ము చేసుకున్నారని.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయవద్దని బీజేపీ హితవు పలికారు. ఏదైనా చేయాలనుకుంటే ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఇంజనీర్లు, మేయర్, కౌన్సిలర్ల నిర్వహణ లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. గత రెండేండ్లలో మూడు లక్షల మందికి పైగా ఇలాంటి నోటీసులు అందాయని ఆయన తెలిపారు. “ఢిల్లీ మొత్తాన్ని నాశనం చేసి, చివరికి ప్రజలను నిరాశ్రయులను చేయడమే బీజేపీ మాస్టర్ ప్లాన్. గత 17 సంవత్సరాలుగా, బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, మేయర్లు మరియు జూనియర్ ఇంజనీర్లు నగరం అంతటా అనధికార నిర్మాణాలను తీవ్రంగా ఆమోదించారు.. అక్రమంగా చాలా డబ్బు సంపాదించారు”అని సిసోడియా ఆరోపించారు. అంతకుముందు రోజుకూడా బీజేపీ అనుస‌రిస్తున్న బుల్డోజ‌ర్ రాజ‌కీయాల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) విమర్శలు గుప్పించింది. డబ్బులు దండుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీలోని నాలుగు ఆల‌యాల‌కు కూల్చివేత నోటీసులు జారీ చేసింద‌ని ఆరోపించింది.

ఆప్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయినా, డిప్యూటీ సీఎం సిసోడియా అయినా, ఆప్‌కి చెందిన మరెవ్వరైనా సరే, తమ ఓటు బ్యాంకు తమ నుంచి జారిపోతుందనే భయంతో వారంతా ఇలా గందరగోళం సృష్టిస్తున్నార‌ని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా అన్నారు. “ఇందుకే సిసోడియా మీడియా సమావేశం నిర్వహించి కేవలం తప్పుడు మరియు నిరాధారమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడారు. వాస్తవం ఏమిటంటే అక్రమ ' ఘుస్పతియాస్ (చొరబాటుదారులు)' పై కార్పొరేషన్ల చర్యను ఆప్ జీర్ణించుకోలేకపోతోందని ఆయన ఆరోపించారు.