తమిళనాడులో దారుణం జరిగింది. కృష్ణగిరిలో డీఎంకే కార్పొరేటర్, అతని సహచరులు ఆర్మీ జవాన్ను దారుణంగా కొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా జవాన్ సోదరుడు గాయపడ్డాడు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. 

తమిళనాడులో భారత ఆర్మీ సైనికుడ్ని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై అధికార డిఎంకె ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బిజెపి చీఫ్ కె అన్నామలై విరుచుకుపడ్డారు. ఇది చాలా సున్నిత విషయమని పేర్కొంటూ.. తమిళనాడులో సైనికులకు తగిన గౌరవం ఇవ్వబడలేదనీ, సైనికులను "గ్రహాంతరవాసులు"గా చూస్తున్నారని వాపోయారు. మన దేశానికి సేవ చేస్తున్న వ్యక్తిని మట్టుబెట్టినందుకు భారతీయుడిగా, ఒక తమిళుడిగా సిగ్గుతో తల దించుకుంటున్నానని అన్నారు.

ఈ ఘటనలో స్థానిక పోలీసుల తప్పు కూడా ఉందనీ, వారు అధికార డిఎంకె పార్టీతో ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునని అన్నారు. స్థానిక పోలీసులకు, యూనిఫాంలో ఉన్న పురుషులు వారి సోదరుల వంటివారు. కానీ వారు కూడా సీరియస్‌గా తీసుకోలేదని కె అన్నామలై ఆరోపించారు. దేశాన్ని రక్షించే వ్యక్తిని రక్షించడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య రాష్ట్రం మొత్తం ప్రతిబింబిస్తుందనీ, ఒక రాష్ట్రంగా తమిళనాడు ఎలాంటి సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కె అన్నామలై అన్నారు.

 అసలేం జరిగిందంటే..?

తమిళనాడులోని కృష్ణగిరిలో దారుణం జరిగింది. కృష్ణగిరిలో డీఎంకే కార్పొరేటర్, అతని సహచరులు ఆర్మీ జవాన్ ను తీవ్రంగా కొట్టారు. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆర్మీ జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జవాన్ సోదరుడు తీవ్ర గాయాలతో చిక్సిత పొందుతున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు.

వివరాల్లోకెళ్తే.. ఫిబ్రవరి 8న పోచంపల్లి ప్రాంతంలో వాటర్ ట్యాంక్ దగ్గర బట్టలు ఉతుకుతున్నందుకు లాన్స్ నాయక్ ఎం. ప్రభు (29) అనే సైనికుడిని డీఎంకే కార్పొరేటర్ చిన్నస్వామి, అతని అనుచరులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జవాన్ ఎం ప్రభు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కార్పొరేటర్ చిన్నస్వామి కుమారుడు రాజపాండి సహా ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చిన్నస్వామి గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.