విపక్ష నేతల ‘‘ ఐ ఫోన్ హ్యాకింగ్ ’’ వెనుక జార్జ్ సోరోస్ లింక్ .. చిదంబరానికి బీజేపీ నేత అమిత్ మాలవీయ కౌంటర్
దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. తమ ఐ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు . జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన యాక్సెస్ నౌ, యాపిల్ నోటిఫికేషన్‌ల మధ్య లింక్‌ను తెలిపేలా బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. తమ ఐ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వారు స్వయంగా ఆధారాలు సైతం చూపిస్తున్నారు. దేశంలోని ప్రతిపక్ష ఎంపీలు నేతల ఐ ఫోన్లకు యాపిల్ కంపెనీ నుంచి ‘‘హ్యాకింగ్ అలర్ట్ ’’ మెసేజ్‌లు రావడం రాజకీయాలను హీటెక్కించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. వందలాది మంది విపక్షనేతలకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్‌లు రావడం అనేది కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అటు బీజేపీ సైతం విపక్షాలకు ఇదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన యాక్సెస్ నౌ, యాపిల్ నోటిఫికేషన్‌ల మధ్య లింక్‌ను తెలిపేలా బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందుకే రాహుల్ గాంధీ అన్నీ వదిలేసి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టడంలో ఆశ్చర్యం లేదని .. పాపిష్టి పన్నాగం ఇక్కడ చూడండి అంటూ ఓ థ్రెడ్‌ను ఆయన పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పెట్టిన పోస్టులో .. ‘‘వందలాది మంది విపక్ష నేతలకు యాపిల్ నుంచి హ్యాకింగ్ మెసేజ్‌లు రావడం కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతోంది. విపక్ష నేతలకే ఎందుకు ఇలా జరుగుతోంది. విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేయడానికి ఎవరి ఆసక్తి వుంటుంది.. పెగాసస్ వ్యవహారం తర్వాత ఇప్పుడు అందరి అనుమానం ప్రభుత్వం వైపే వుంది, ఇప్పటి వరకు ఇది కేవలం అనుమానం మాత్రమే.. ’’ నని చిదంబరం పోస్ట్ చేశారు.
అప్పటి కేంద్ర మంత్రి, దివంగత ప్రణబ్ ముఖర్జీ తన ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయాలు బగ్‌కు గురయ్యాయని చెప్పారని గుర్తుచేస్తూ పాత వార్తా కథనం స్క్రీన్ షాట్‌ను మాలవీయ పంచుకున్నారు. ‘‘ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఆయన కార్యాలయంలో బగ్ జరిగినప్పుడు మీరు హోం మంత్రిగా వున్నారు.. గుర్తుందా మిస్టర్ చిదంబరం అంటూ మాలవీయ ఫైర్ అయ్యారు.
థ్రెడ్‌లోని పార్ట్ 2 జార్జో సోరోస్ నిధులతో భారతదేశంలో నిర్మించిన ‘‘యాక్సెస్ నౌ’’ నెటవర్క్ వివరాలను వివరిస్తుంది. విపక్ష ర్యాంక్‌లోని సాధారణ అనుమానితుల ద్వారా (యాపిల్ నుంచి) స్వీకరించబడిన నోటిఫికేషన్ కూడా యాక్సెస్ నౌని సూచిస్తుంది. మీరు అద్భుత కథలను మాత్రమే విశ్వసిస్తే మాత్రం.. అదంతా యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా అని మాలవీయ ఎద్దేవా చేశారు.
ఇదే వ్యవహారంలో ఎలాన్ మస్క్ షేర్ చేసిన వీడియోను కూడా మాలవీయ పంచుకున్నారు. ‘‘జార్జ్ సోరోస్ ఎంత దుర్మార్గుడో , యాదృచ్ఛికంగా భారతదేశ విపక్షానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఆయన సన్నిహిత మిత్రుడు’’ అని మాలవీయ దుయ్యబట్టారు.