ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంజాబ్‌లో భద్రతా లోపం ఏర్పడటంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పంజాబ్ సహా దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. పంజాబ్‌లో కొందరు బీజేపీ వర్కర్లు రోడ్డెక్కారు. అమృత్‌సర్‌కు వెళ్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఓపీ సోని కారును వారు ఆపారు. ఆయన చుట్టూ చేరి జై శ్రీరాం అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ఉపముఖ్యమంత్రి కూడా వారితో నినాదాలు చేశారు. మోడీ జిందాబాద్ అంటూ నినాదం ఇచ్చారు. ఆ తర్వాత ఆ వర్కర్లు ఆయన కారును విడిచి పెట్టారు. 

చండీగడ్: ప్రధాని మోడీ(PM Modi)కి పంజాబ్‌(Punjab)లో భద్రతా లోపం(Security Breach) అంశంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. బీజేపీ వర్కర్లు అయితే.. ఆ ఘటనను నిరసిస్తూ పంజాబ్‌లో రోడ్డెక్కారు. ఇదే నేపథ్యంలో పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనికి బీజేపీ వర్కర్ల(BJP Workers) నుంచి సెగ ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓపీ సోని కారును బీజేపీ వర్కర్లు అడ్డుకున్నారు. ఆయన కారులో అమృత్‌సర్‌కు వెళ్తున్నారు. ఆయన కారును అడ్డుకుని బీజేపీ వర్కర్లు ఘెరావ్ చేశారు. వెంటనే ఆయన కారు నుంచి కిందకు దిగారు. బీజేపీ వర్కర్లు ఆయన చుట్టూ గుమిగూడారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. చేసేదేమీ లేక.. ఉప ముఖ్యమంత్రి ఓపీ సోని.. మోడీ జిందాబాద్ అంటూ నినాదం ఇచ్చారు. అనంతరం, ఆయన కారును బీజేపీ వర్కర్లు విడిచి పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓపీ సోని.. మోడీ జిందాబాద్ అని నినదించడం సంచలనంగా మారింది.

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కూడా నిరసనల సెగ తగిలింది. ఆయన ఇండియా టుడేకు కారులో ఇంటర్వ్యూ ఇస్తుండగా వారికి మార్గం మధ్యలో ఆందోళనలు ఎదురయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భద్రతా వైఫల్యం అంశంపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలోని కమిటీ దర్యాప్తు చేస్తుందని సీఎం తెలిపారు. మూడు రోజుల్లో ఈ నివేదికను సమర్పిస్తారని వివరించారు. భద్రతా లోపంపై కమిటీని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఆయన చెబుతుండగానే దారిలో నిరసనకారులు కనిపించారు. ఆ ఆందోళనను గమనించి సీఎం తన కారును మెల్లగా పోనివ్వాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత కారును ఆపాల్సిందిగా పేర్కొన్నారు.

Also Read: గతంలో ప్రధానికి భద్రతా లోపాలు ఏర్పడ్డాయా? ఎప్పుడెప్పుడు వైఫల్యాలు ఏర్పడ్డాయంటే..!

వెంటనే ఆ విలేకరితోపాటు ఆయన కారు దిగి నిరసనకారుల దగ్గరకు వెళ్లారు. ‘వీరు నా కారును ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా నన్ను ఆపేయాలని చూస్తున్నారు. నేను వీరిని చంపేస్తానా? పది మంది నా కారును ఆపడానికి వచ్చారు. పోలీసులూ కాన్వాయ్‌ చుట్టూ ఉన్నారు. ప్రధాని కారునైతే కనీసం ఎవరూ ఆపనే లేదు. నిజానికి ఆందోళనకారులకు ప్రధాని మోడీ కారు సుమారు కిలోమీటరు దూరంలోనే ఆగింది. ముందస్తుగా తాము సమాచారం ఇవ్వడంతో కారును అక్కడే ఆపేశారు’ అని తెలిపారు. అక్కడికి వెళ్లి సీఎం చన్నీ ఆందోళనకారులతో మాట్లాడారు. వారి డిమాండ్లు ఏమిటనీ అడిగారు. దీనికి వారు రేపు తమతో సమావేశం కావాలని కోరారు. దీనికి ఆయన ఇది వరకే తాను వారితో సమావేశం అవుతానని చెప్పి ఉన్నానని, అయినప్పటికీ ఎందుకు తనను ఆపాలని భావిస్తున్నారని అడిగారు. దీనికి సమాధానం లేదు. తాను కచ్చితంగా వారితో రేపు సమావేశం అవుతానని చెప్పి తిరిగి కారు వద్దకు వెళ్లిపోయారు. నిరసనకారులూ వారికి దారి ఇచ్చారు.

ఆందోళనచేయడం వారికి ఉన్న హక్కు అని సీఎం చన్నీ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకీ వస్తుందని తెలిపారు. ఈ కోడ్ అమల్లోకి రాక ముందే వారు తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారని అన్నారు. అంతే, తప్పితే వారిలో తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదని వివరించారు. ప్రధాని మోడీకి కూడా ప్రాణ హానీ ఏమీ లేదని అన్నారు. ఆయన దీర్ఘకాలం జీవించాలనీ ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.