CM Ashok Gehlot: ఓట్ల పోలరైజ్ చేసి, తెలివిగా ప్రకటనలు చేయడం ద్వారా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ఆరోపించారు. యుపిలో కరోనా మహమ్మారి నిర్వహణ ఎలా ఉందో అందరికీ తెలుసు. వారు తెలివిగా మాట్లాడటం, ప్రచార ఆర్భాటాలతో బీజేపీ గెలిచిందని విమర్శించారు.
CM Ashok Gehlot: సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. అయితే.. ప్రతిపక్షాలకు బీజేపీ సాధించిన విజయం మింగుడు పడటం లేదు. తమదైన శైలిలో విమర్శాస్త్రాలు సంధించారు. తాజాగా నేడు రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదంతో పాటు మత ప్రతిపాదికన ఓట్లను చీల్చడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించిందని అశోక్ గెహ్లోత్ అన్నారు. బీజేపీ నేతలు ఇలా తెలివిగా మాట్లాడటం వల్లే.. ప్రతిపక్షాలు వెనుకబడిపోయాయని గెహ్లాట్ పేర్కొన్నారు.
దండి మార్చ్ 92వ వార్షికోత్సవం సందర్భంగా శాంతియాత్రలో పాల్గొన్న అనంతరం గాంధీ సర్కిల్‌లో జరిగిన సభలో గెహ్లాట్ ప్రసంగిస్తూ, దేశంలో నేటి ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు మన దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాన్ని అనుసరించి సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
యూపీతో పాటు దేశంలో COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యం ప్రతి ఒక్కరికీ తెలుసని అయితే ప్రచార ఆర్భాటంతో కాషాయ పార్టీ ప్రజల మైండ్‌సెట్‌ను మార్చివేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఐటీ, ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాషాయ పాలకులు పబ్బం గడుపుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ఇలా ప్రజల ఆలోచనలను బీజేపీ మార్చిందనీ, చివరికి సత్యమే గెలుస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు.
కేంద్ర ఏజెన్సీలను కాంగ్రెస్ అప్రతిష్టపాలు చేస్తోందన్న ఆరోపణలపై గెహ్లాట్ స్పందిస్తూ, ఈడీ, సీబీఐతో పాటు న్యాయవ్యవస్థ, ఆదాయపు పన్ను శాఖలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా I-T, ED, CBI దాడులు ఎవరి ఆదేశానుసారం జరుగుతున్నాయో? అనేది యావత్తు భారతం చూస్తోందని అన్నారు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరవేస్తే.. బీజేపీ నిజస్వరూపం బట్టబయలు అవుతుందనీ, నిజం బయటకు వస్తుందనీ, గాంధీ బాటలో నడుస్తామని అన్నారు.
గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండబోదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రకటన నేపధ్యంలో గెహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వం పటిష్టంగా ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె కూడా హైకమాండ్‌కు బాసటగా నిలిచారు.
ఈ ఓటమితో పార్టీలోనూ, బయటా కూడా నాయకత్వంపై అసమ్మతి బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ గురువారం మాట్లాడుతూ..పార్టీలో వ్యవస్థీకృత మార్పులు, లీడర్‌షిప్‌లో సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు గుర్తు చేశాయని తెలిపారు. దేశ ప్రజల్లో కాంగ్రెస్ ఐడియాలజీని మళ్లి పునరుద్ధరించేలా వ్యవస్థీకృత నాయకత్వంలో మార్పులు తప్పవన్నారు. గెలవాలంటే.. మార్పు తప్పదని స్పష్టం చేశారు.
