త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. ధన్పూర్, బాక్సానగర్ స్థానాలు కైవసం..
త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రెండు స్థానాల్లోనూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరింది.

త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ విజయం సాధించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన బాక్సానగర్, ధన్పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
66 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్న బాక్సానగర్ లో బీజేపీ అభ్యర్థి తఫజల్ హుస్సేన్ 30,237 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 34,146 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం)కు చెందిన మిజాన్ హుస్సేన్ కు 3,909 ఓట్లు వచ్చాయి. అలాగే గిరిజన జనాభా గణనీయంగా ఉన్న ధన్పూర్ లో బీజేపీ అభ్యర్థి బిందు దేబ్ నాథ్ 18,871 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు కు 30,017 ఓట్లు రాగా, సీపీఐ(ఎం)కు చెందిన సమీప ప్రత్యర్థి కౌశిక్ చందాకు 11,146 ఓట్లు వచ్చాయి.
కాగా.. పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల సంఘం అలసత్వం వహించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సీపీఐ(ఎం) ఓట్ల లెక్కింపును బహిష్కరించింది. ఈ రెండు స్థానాల్లో అధికార బీజేపీ, సీపీఐ(ఎం) మధ్య హోరాహోరీ పోరు జరగ్గా, మిగిలిన రెండు ప్రతిపక్ష పార్టీలైన టిప్రా మోతా, కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. కాగా.. ఈ రెండు స్థానాల్లో సగటున 86.50 శాతం పోలింగ్ నమోదైంది. సోనామురా బాలికల పాఠశాలలో కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ నిర్వహించారు.
సీపీఐ (ఎం) ఎమ్మెల్యే సంసుల్ హక్ మరణంతో బాక్సానగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ధన్ పూర్ ఎమ్మెల్యే పదవికి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో కూడా ఉప ఎన్నిక నిర్వహించారు. ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ధన్ పూర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, ఉప ఎన్నికల్లోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. మైనారిటీల ప్రాబల్యం ఉన్న బాక్సానగర్ స్థానాన్ని సీబీఐ(ఎం) నుంచి అధికార పార్టీ స్వాధీనం చేసుకుంది.
ఈ విజయాలతో 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ బలం 33కు పెరిగింది. మొత్తంగా బీజేపీకి మిత్రపక్షమైన ఐపీఎఫ్టీకి ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష తిప్రా మోథాకు 13 మంది, సీపీఎంకు 10 మంది, కాంగ్రెస్ కు ముగ్గురు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు.