న్యూఢిల్లీ: షికార అనే సినిమా చూస్తూ బిజెపి సీనియర్ నేత ఉద్వేగానికి గురయ్యారు. షికార: ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్ అనే సినిమా హిందీలో నిర్మితమైంది. ఈ సినిమాను కాశ్మీరీ పండితులను కాశ్మీర్ నుంచి తరిమేసిన సంఘటనల ఆధారంగా నిర్మించారు. సినిమాకు విధు వినోద్ చోప్రా నిర్మించి దర్శకత్వం వహించారు. 

సినిమా పూర్తయ్యేసరికి ఎల్ కే అద్వానీ కన్నీటిని ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యం, ఆయనను ఓదార్చడానికి చోప్రా ఆయన వద్దకు పరుగెత్తే దృశ్యం వీడియోలో రికార్డయింది. ఇతరులు కూడా ఉద్వేగానికి గురి కావడం, దర్శకుడిని అభినందించడం వీడియోలో రికార్డు అయింది.

1990 ప్రారంభంలో కాశ్మీరీ పండితులు తమ ఇళ్లను వదిలేసి బయటకు రావాల్సిన తీవ్ర పరిస్థితులను ఆధారం చేసుకుని ఆ సినిమాను నిర్మించారు. కాశ్మీరీ పండితులు ప్రమాదకరమైన పరిస్థితిని తట్టుకుని తమ జీవితాలను పునరుద్ధరించుకునే స్థితిని సినిమాలో చూపించినట్లు చోప్రా చెప్పారు. 

ఆదిల్ ఖాన్, సాదియా నటించిన షికార సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైంది. కాశ్మీర్ కు చెందిన విధు వినోద్ చోప్రా తన సినిమాను 2007లో మరణించిన తన తల్లికి అంకితం చేశారు.