Asianet News TeluguAsianet News Telugu

మనీష్ సిసోడియాకు సీఎం పోస్టు ఆఫర్ చేసిన బీజేపీ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించింది: ఆప్

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఆరోపించింది. మనీష్ సిసోడియాను లోబర్చుకోవాలని ప్రయత్నించి విఫలమైందని పేర్కొంది. ముందు మనీష్ సిసోడియాను టార్గెట్ చేసిందని, ఆయనపై కేసులు పెట్టిందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ విమర్శించారు. చివరకు ఆప్ వదిలి బీజేపీ చేరితే అన్ని కేసులు కొట్టేసి సీఎంను చేస్తామని ఆఫర్ ఇచ్చిందని ఆరోపించారు.

bjp tried to topple delhi govt.. offer cm post to manish sisodia alleges AAP
Author
First Published Aug 23, 2022, 2:02 PM IST

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ చుట్టూ ముసురుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేసిందని, ఇందుకోసం డిప్యూటీ సీఎం, ఆప్‌లో నెంబర్ 2 మనీష్ సిసోడియాకు సీఎం పోస్టును ఆఫర్ చేసిందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన లోటస్ ద్వారా కేజ్రీవాల్ సర్కారును కూల్చాలని బీజేపీ పన్నాగం పన్నిందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.

మనీష్ సిసోడియాను ఎక్సైజ్ పాలసీ ఆధారంగా టార్గెట్ చేశారని, సీఎం పోస్టు ఆశ చూపించారని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మనీష్ సిసోడియా ఆప్‌ను వదిలి బీజేపీలో చేరితే ఆయనపై నమోదైన కేసులు అన్నింటినీ ఎత్తేస్తామని, ఢిల్లీ సీఎం పోస్టు కూడా ఇస్తామని ఆఫర్ చేసిందని ఆరోపించారు. కానీ, మనీష్ సిసోడియా ఆ ఆఫర్‌ను తిరస్కరించారని తెలిపారు. దీంతో బీజేపీ మరోసారి తమ ప్రభుత్వాన్ని కూల్చడంలో విఫలం అయిందని వివరించారు.

ముందుగా వారు విద్యా రంగాన్ని టార్గెట్ చేసి మనీష్ సిసోడియాను లోబర్చుకోవాలని ప్రయత్నించారని అన్నారు. కానీ, అది సాధ్యం కాలేదని, ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకుందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత 31 లొకేషన్లలో సీబీఐ దాడులు చేసిందని అన్నారు. ఈ దాడుల్లోనూ వారికి ఏమీ దొరక్కపోవడంతో మనీష్ సిసోడియాకు సీఎం పోస్టు ఆఫర్ చేశారని తెలిపారు. ఐదు కోట్ల రూపాయలను కూడా ఆప్ నేతకు ఆఫర్ చేసి భంగ పడ్డారనీ ఆరోపించారు.

ప్రజలు తమకు ఇష్టమైన, అభివృద్ధిపై విశ్వాసంతో నమ్మిన పార్టీకి ఓటేసి అసెంబ్లీకి పంపిస్తుంటే.. బీజేపీ మాత్రం ఆ ప్రభుత్వాలను కూల్చే పనిలో ఉన్నదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ తుంగలో తొక్కుతున్నదని ఆరోపణలు చేశారు. బీజేపీ మన దేశ డిక్షినరీలోకి కొత్తగా ఆపరేషన్ లోటస్‌ పదాన్ని చేర్చారని వివరించారు. మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటకలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అక్రమంగా బీజేపీ కూలదోసిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఈ ఎపిసోడ్ చూడొచ్చని వివరించారు. మహారాష్ట్రలోనూ ఇలాంటి వ్యవహారమే చేపట్టిందని అన్నారు.

ప్రజల అభీష్టం మేరకు ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడుతున్నదని బీజేపీపై విమర్శలు చేశారు. ఎన్నికల వేళ స్వయంగా ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పరివారమంతా ప్రచారం చేస్తారని, ప్రజలు వారిని తిరస్కరించి వేరే పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే.. అప్పుడు ఎమ్మెల్యేలను విడగొట్టి తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని కూలదోసి కొత్తగా వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios