సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. భారత ప్రధానిగా వరుసగా రెండవసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మోడీ ప్రమాణస్వీకారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మే 30న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. నేడు ఢిల్లీలో విజయం సాధించిన అందరు బిజెపి అభ్యర్థులతో పార్టీ అధిష్ఠానం సమావేశం నిర్వహించబోతోంది. 

ఇదిలా ఉండగా మోడీ ప్రమాణస్వీకారానికి వివిధ దేశాధినేతలని ఆహ్వానించాలని బిజెపి అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూలని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. వీరందరితో మోడీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. 

మరోవైపు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, చైనా,ఫ్రాన్స్, రష్యా, యూకే దేశాధినేతలు కూడా ఆహ్వానాలు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ అగ్రదేశాధినేతలు మోడీ ప్రమాణస్వీకారానికిహాజరు కాలేని పక్షంలో వారి మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ మొదటి నుంచి ఇండియాకు అంతర్జాతీయంగా పట్టు పెంచాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.