Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర సంక్షోభంపై బీజేపీ స్ట్రాటజీ ఇదే.. అందుకే హడావిడీ లేదు!

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం సంక్షోభం అంచుల్లో ఉన్నది. ఏ క్షణంలోనైనా కూలిపోయే ముప్పు ఉన్నది. కానీ, ఈ పరిస్థితులను ఎప్పటిలాగే బీజేపీ అడ్వాంటేజీగా తీసుకోకుండా మౌనం దాల్చడం చర్చనీయాంశం అవుతున్నది. ఈ సారి బీజేపీ స్ట్రాటజీ వేరుగా ఉన్నది.
 

bjp strategy is wait and watch for requisite numbers in maharashtras political turmoil
Author
Mumbai, First Published Jun 22, 2022, 4:58 PM IST

ముంబయి: మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలక వస్తుందా? అనే స్థాయికి పరిణామాలు వెళ్లినా.. బీజేపీ మాత్రం హడావుడి చేయడం లేదు. తన వెంట 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తిరుగుబావుటా ఎగరేసిన ఏక్‌నాథ్ షిండే ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం ఆచితూచి అనే దారిని ఎంచుకున్నది. గతంలో కొంత వ్యతిరేకత వచ్చినా.. తిరుగుబాటు వ్యాఖ్యలు వచ్చినా.. బీజేపీ రచ్చ చేసేది. కానీ, ఇప్పుడు ఏకంగా ఏక్‌నాథ్ షిండే వెంట శివసేన ఎమ్మెల్యేలు రాష్ట్రాలు దాటుతున్నప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ స్ట్రాటజీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2019లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మళ్లీ అలాంటి తప్పిదం పునరావృతం కావొద్దని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హడావుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, మూడు రోజుల తర్వాత మెజార్టీ బలం లేనందున రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సారి కచ్చితంగా నెంబర్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. నెంబర్స్ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించాలని యోచిస్తున్నది. కేవలం మెజార్టీ సంఖ్యను దాటే బలం కాదు.. ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా సునాయసంగా నడిపేలా ఉండాలని ఆలోచిస్తున్నది. అందుకే ఈ సారి శివసేనలో ఈ స్థాయిలో గందరగోళం నెలకొన్నప్పటికీ బీజేపీ తొందరపడటం లేదు.

శివసేన ప్రభుత్వం దానంతట అదే పడిపోవాలని బీజేపీ ఎదురుచూస్తున్నది. అయితే, ప్రస్తుత పరిస్థితులను క్లోజ్‌గా పర్యవేక్షిస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏక్‌నాథ్ షిండే వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో బీజేపీ కన్విన్స్ అయిన తర్వాతే బల నిరూపణకు డిమాండ్ చేస్తామని వివరిస్తున్నారు.

బీజేపీ నేత ఒకరు మీడియా సంస్థ ది ప్రింట్‌తో మాట్లాడుతూ, ఎమ్మెల్యేల సంఖ్యపై తమకు కచ్చితత్వం కావాలని, షిండేతో మరింత మంది ఎమ్మెల్యేలు చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అది జరిగే వరకు తాము బల నిరూపణకు డిమాండ్ చేయబోమని స్పష్టం చేశారు.

కాగా, మహారాష్ట్ర బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఇప్పటి వరకైతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవని, ఇటు బీజేపీ వైపు నుంచి అటు ఏక్‌నాథ్ షిండే వైపు నుంచి కూడా ఈ ప్రతిపాదనలు రాలేవని తెలిపారు. అయితే, రాజకీయాల్లో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చని పేర్కొన్నారు.

2019లో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ బీజేపీ వైపు వచ్చి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కూడా శరద్ పవార్ రాజకీయంతో మళ్లీ వెనక్కి రప్పించుకున్నాడని మరో నేత పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేలను వారి వైపు తిప్పుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి, సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలు షిండే వైపు వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచిస్తామని తెలిపారు.

అసెంబ్లీ ఇప్పటికే సగం గడువుకు చేరుకుందని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలంటే ఎమ్మెల్యేలు సిద్ధపడరని, కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించడమే మేలని మరో బీజేపీ నేత చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై స్పష్టత అంతంతగానే ఉన్నదని, కచ్చితమైన సమాచారం లేదని వివరించారు. ఇటీవలి ఉపఎన్నికలో ఎంవీఏ ప్రభుత్వం గెలుచుకున్న తీరును చూస్తే.. ఆ ప్రభుత్వాన్నే కొనసాగించడం ఉత్తమం అని వివరించారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను ఎవరు కాదనుకుంటారు? కానీ, అందుకు అన్ని నిర్ణయాలు, పరిస్థితులు సానుకూలంగా ఉండాలని తెలిపారు. రెబల్స్.. బీజేపీ కోరుకున్న సంఖ్యలో ఉండాలని, ఇతరులనూ బీజేపీ తన వెంట తెచ్చుకోవాలని వివరించారు. అయితే, ఒక వేళ ఏక్‌నాథ్ షిండే తాము ఆశించిన సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడబెట్టకుంటే.. తాము రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios