చంద్రబాబుకు చుక్కలు, కేసిఆర్ కు ఊరట: బిజెపి వ్యూహం ఇదీ...

BJP strategy in Telangana and AP
Highlights

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రాలేమని గ్రహించిన బిజెపి ప్రత్యామ్నాయ వ్యూహరచన చేసి అమలు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానీయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో కాంగ్రెసును నిలువరించడానికి ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అది తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు ప్రయోజనం చేకూరుస్తుందని అనుకుంటున్నారు.

నిజానికి, పొమ్మనలేక తెలుగుదేశం పార్టీకి పొగ పెట్టి, ఎన్డీఎతో తెగదెంపులు చేసుకోవడానికి బిజెపి వ్యూహరచన చేసింది. చంద్రబాబు తనంత తానుగా ఎన్డీఎ నుంచి వైదొలిగిన తర్వాత ఆయనను ఓడించేందుకు పావులు కదుపుతోంది. ఎపిలో జనసేన లేదా వైఎస్సార్ కాంగ్రెసు అధికారంలోకి రావాలని, ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు రాకూడదని బిజెపి అనకుంటోంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వమేదీ రాకూడదనే ఉద్దేశంతో కూడా బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన, వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీట్లను పంచుకోవడం ద్వారా త్రిశంకు శానససభ ఏర్పడే పరిస్థితులు రావాలని కోరుకుంటోంది. రాజకీయ సంక్షోభం తలెత్తేలా చూడాలని అనుకుంటోంది.
 
తెలంగాణలో కేసిఆర్ ను ఎదుర్కుంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా కాంగ్రెసుకు నష్టం జరిగేలా చూడాలని బిజెపి ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తం మీద, బిజెపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తనకు అనుకూలమైన పార్టీలు అధికారంలోకి వచ్చేలా చూడాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీలు కేంద్రంలో తమను బలపరిచే విధంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

loader