Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీని తప్పించడం వెనుక బీజేపీ వ్యూహం ఇదేనా?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరో 15 నెలలు జరగనుండగా సీఎంగా విజయ్ రూపానీతో రాజీనామా చేయించడం వెనుక బీజేపీ వ్యూహమేంటనే అంశంపై చర్చ జోరందుకున్నది. విజయ్ రూపానీ రాజీనామా హఠాత్పరిణామం కాదని, పార్టీ నేతలు కొన్ని నెలలపాటుగా రాష్ట్రంలోని పరిస్థితులన పరిశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయంగా తెలుస్తున్నది.

bjp strategy behind removing gujarat cm vijay rupani
Author
Ahmedabad, First Published Sep 11, 2021, 6:43 PM IST

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రూపానీని పదవి నుంచి తప్పించింది. తాజాగా, ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు, మరో 15నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ఊపందుకున్నది. సీఎంగా విజయ్ రూపానీని తప్పించడం వెనుక బీజేపీ వ్యూహాలపై చర్చ జరుగుతున్నది.

గుజరాత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికెళ్లి చేసిన ప్రచారమే బీజేపీని కాపాడిందన్న అభిప్రాయాలున్నాయి. ఈ సారి కూడా కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో టాఫ్ కాంపిటీషన్ కనిపించే అవకాశం ఉన్నది. దీనికి తోడు సుమారు రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీపై వ్యతిరేకత ఏర్పడటం సహజమే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటిదార్ ఓటు బ్యాంకు కీలకమైంది. రాష్ట్రంలో విజయ్ రూపానీ జైన్ కమ్యూనిటీ జనాభా రెండు శాతం మాత్రమే. వచ్చే ఎన్నికల్లో పోటీకి 65ఏళ్ల విజయ్ రూపానీ సారథ్యంపై బీజేపీ నమ్మకం లేదని మరో వాదన వస్తున్నది. సీఎంకు ముందు విజయ్ రూపానీది మాస్ ఫేస్ కాదు. ఇప్పటికీ పార్టీలోనూ ఆయనకు ఆదరణ పెద్దగా లేదని తెలుస్తున్నది. ఈ కారణంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సీఆర్ పాటిల్‌ను నియమించినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

సీఎంగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన తర్వాత సరికొత్త ఉత్తేజం, నూతన ఉత్సాహం అనే పదాలను వాడారు. తద్వారా కొత్త సీఎంగా ఆయన కంటే చిన్న వయస్కుడికి బాధ్యత ఇచ్చే అవకాశముందని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

కొవిడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రజలలో రూపానీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్నది. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఈ వ్యతిరేకత వస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యతిరేకత ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడకుండా నాయకత్వ మార్పు నిర్ణయం తీసుకున్నారనేది మరో వాదన. టికెట్ల కేటాయింపులోనూ ఈ నిర్ణయ ప్రభావముంటుందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి ఇతరులకు టికెట్ ఇవ్వడానికి మార్గం సుగమమైనట్టు చర్చ జరుగుతున్నది.

రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులపై గుజరాత్ ఇన్‌చార్జీ భూపేందర్ యాదవ్, పార్టీ జనరల్ సెక్రెటరీ(వ్యవస్థాగత) బీఎల్ సంతోశ్‌లు కొన్ని నెలలుగా సమగ్ర వివరాలను పరిశీలించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం ముందుకు వచ్చినట్టు తెలిసింది.

బీజేపీ తీరే ఇదని ఇంకొందరు చెబుతున్నారు. గత అసెంబ్లీ(2017) ఎన్నికలకు ముందు కూడా అప్పటి సీఎం ఆనందిబెన్ పటేల్‌తో రాజీనామా చేయించిన బీజేపీ అనూహ్యంగా రూపానీకి ఆ బాధ్యతలు కట్టపెట్టిందని గుర్తుచేస్తున్నారు.

ఈ ఏడాది పలువరు ముఖ్యమంత్రులను బీజేపీ మార్చింది. ఉత్తరాఖండ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చగా, కర్ణాటకలో యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు.

తదుపరి సీఎం రేసులో ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios