పేరుకే ఇండియా....భారత్ వ్యతిరేక విధానాలు: విపక్ష కూటమిపై బీజేపీ ఫైర్
ఇండియా పేరు పెట్టుకొని భారత్ కు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని విపక్ష కూటమిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ విమర్శించారు.

న్యూఢిల్లీ: తాను వందేమాతరం చెప్పేందుకు తన మతం అనుమతించదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ తప్పు బట్టారు. విపక్ష కూటమి ఇండియా ఆలోచన ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. లేక భారత్ వ్యతిరేక విధానమా అని ఆయన అడిగారు. విపక్ష కూటమి ఇండియాలో సమాజ్ వాదీ పార్టీ కూడ భాగస్వామిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇండియా పేరు పెట్టుకున్నా.. ఎజెండాలో మాత్రం భారత్ కు వ్యతిరేక చర్యలేనని ఆయన మండిపడ్డారు. గతంలో యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యాకూబ్,అఫ్జల్ అనే ఉగ్రవాదులను పెంచి పోషించారని షెహజాద్ జైహింద్ ఆరోపించారు.
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, 26/11 దాడులపై పాకిస్తాన్ పై కాకుండా భారత్ పైనే కాంగ్రెస్ పార్టీ నిందలు మోపిందని ఆయన జైహింద్ గుర్తు చేశారు.ఈ విషయమై తమ వైఖరిని చెబుతారా అని మమత బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా జైహింద్ విపక్ష కూటమిపై విమర్శలు చేశారు.