ప్రధాని మోడీని దేవుడి ముందు కూర్చోబెడితే ఈ లోకం ఎలా నడుస్తున్నదో దేవుడికే వివరించే సాహసం చేస్తాడని రాహుల్ గాంధీ వ్యంగ్యం పలికారు. ప్రధాని, బీజేపీ నేతలపై రాహుల్ గాంధీ అమెరికాలోని ఓ సమావేశంలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ బలమైన కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోడీకి విదేశీ పర్యటనలో వచ్చే ప్రశంసలను జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ ప్రేలాపనలు చేస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఈ రోజు అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధికార పార్టీ బీజేపీవాళ్లు తమకు అన్నీ తెలుసని భ్రమపడుతారని రాహుల్ గాంధీ అన్నారు. ఒక వేళ ప్రధాని మోడీని దేవుడి ముందు కూర్చోబెడితే.. ఈ లోకం ఎలా నడుస్తున్నదో దేవుడికే ఆయన వివరిస్తారు అని వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఉపేక్షించలేదు. గట్టి కౌంటర్‌తో బదులిచ్చింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రియాక్ట్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడూ అనూహ్య స్పందన వస్తుందని వివరించారు. చాలా మంది గొప్పగా ఆయనను అభినందిస్తారని తెలిపారు. ఆయనకు వచ్చిన ప్రశంసలను ఈ కాంగ్రెస్ నేత జీర్ణించుకోవడం లేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల్లో భారత్ దేశాన్ని అవమానిస్తారని ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్లో సుమారు 50 మీటింగ్‌లలో పాల్గొని 24 మంది ప్రధానులు, అధ్యక్షులను కలుసుకున్నారని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని అయితే.. మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోడీనే బాస్ అని కూడా అన్నారు. కొందరు ప్రధాని మోడీ కాళ్లు మొక్కుతున్నారని, ఇలా భారత దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. అందుకే ఇలాంటి ప్రశంసలను రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోడీని అవమానించాలని ప్రయత్నించి మొత్తం దేశాన్నే అవమానిస్తున్నారని, ఇప్పుడు కూడా అదే జరిగిందని ఆరోపణలు చేశారు. ఈయన విదేశాలకు వెళ్లి ఏం సాధించాలని అనుకుంటారో తెలియదని, కానీ, ప్రపంచంలో భారత్‌కు పెరుగుతున్న గుర్తింపు, ప్రాబల్యానికి ఆయన ఏదో విధంగా హానీ తలపెడుతున్నాడని అన్నారు.
Also Read: గంగా నదిలో పతకాలు కలపాలనే నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే?
రాహుల్ గాంధీ పది రోజుల పర్యనటలో భాగంగా అమెరికాకు వెళ్లారు. అక్కడ మొహబ్బత్ కీ దుకాన్ అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్‌లో కొన్ని సమూహాలు ఉన్నాయి. అవి తమకు అంతా తెలుసు అనే భ్రమలో ఉన్నాయి. భారత్‌లో భిన్న భాషలు, భిన్న మతాల నడుమ కలిసి జీవిస్తాం. ఈ విధానాన్ని ఇప్పుడు దాడి చేస్తున్నారు. గాంధీ, గురు నానక్ వంటి మహనీయుల ప్రభావంతో భారతీయులు ఎప్పుడూ తమకూ సర్వం తెలుసు అనే భావనలో ఉండరు. కానీ, భారత్‌లోని కొన్ని గ్రూపులు తమకు సర్వం తెలుసు అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఒక వేళ వారు దేవుడితో సంభాషించినా.. ఆయనకే వివరణ ఇస్తారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘అఫ్ కోర్స్ ప్రధాన మంత్రి కూడా అందులో ఒకరు. ఒక వేళ దేవుడి ముందు ఆయనను కూర్చోబెడితే.. ఈ లోకం అంతా ఎలా నడుస్తున్నదో ఆయన దేవుడికే వివరించే సాహసం చేస్తారు. దానితో అసలు నేనేం సృష్టించానా? అనే గందరగోళంలో దేవుడు పడిపోతారు. బీజేపీ వాళ్లు సైంటిస్టులకే సైన్స్ అంటే ఏంటో వివరిస్తారు. చరిత్రకారులకు చరిత్ర చెబుతారు. ఆర్మీకి యుద్ధ వ్యూహాలు చెబుతారు. ఎగరడం ఎలాగో వైమానిక దళానికి వివరిస్తారు. కానీ, నిజం చెప్పాలంటే.. వారికి అసలేమీ తెలియదు’ అని ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై రాహుల్ గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.