తాజా లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని సీనియర్ నేతలను బుజ్జగించేందుకు బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. వారిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి సంతృప్తిపరచాలని భావిస్తోంది.

వీరిలో కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కల్ రాజ్ మిశ్రా, శాంతాకుమార్, ఉమా భారతి, ప్రేంకుమార్ ధూమల్ ఉన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం త్వరలో ముగుస్తుండటంతో వారి స్థానంలో బీజేపీ నేతలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే పలువురిపై బదిలీవేటు తప్పదని భావిస్తున్నారు. కొత్త గవర్నర్ల నియామకంపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా కసరత్తు పూర్తి చేసినట్లుగా బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సుష్మాను పంజాబ్‌కు, సుమిత్రను మహారాష్ట్రకు గవర్నర్లకు నియమించే అవకాశాలు ఉన్నాయని టాక్. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఈసారి వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశాలున్నాయని హోంశాఖ వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కి గవర్నర్‌గా వచ్చిన నరసింహన్... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు కొనసాగవలసిందిగా ఆయనకు చెప్పామని హోంశాఖ వర్గాలు తెలియజేశాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలైనా ఏపీ, తెలంగాణ, కేరళ, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ రాష్ట్రాల్లో సమర్థులైన వ్యక్తులను గవర్నర్లుగా నియమించి తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలని బీజేపీ అధినాయత్వం భావిస్తోందని వారు విమర్శిస్తున్నారు.

ఈ కోవలోనే ఉత్తరప్రదేశ్ మాజీ స్పీకర్ కేసరీ నాథ్ త్రిపాఠీని బెంగాల్ గవర్నర్‌గా నియమించి లబ్ధిపొందిన కమలనాథులు ఇదే ఫార్ములాను మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.