న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్లకు బీజేపీ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. గౌరవప్రదమైన పోస్టులు ఇచ్చి వారిని గౌరవించాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గత ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీమంత్రులు, సీనియర్ నేతలకు పదవులను కట్టబెట్టాలని ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

గతంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌, లోక్‌ సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, సీనియర్ నేతలు కల్‌రాజ్ మిశ్రా, శాంత కుమార్‌, ఉమాభారతితో పాటు మరికొందరు సీనియర్లకు గవర్నర్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

వీరితోపాటు రీసెర్చ్‌ అండ్‌ అనలిస్ట్‌ వింగ్‌ మాజీ చీఫ్‌ అనిల్‌ కుమార్‌, ఇంటెల్సిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ రాజీవ్‌ జైన్‌, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి దినేశ్వర్‌ శర్మ, హిమాచల్‌ ప్రదేశ్ మాజీ సీఎంలు ప్రేమ్‌ కుమార్‌ ధమాల్‌, శాంతా కుమార్‌లకు కూడా గవర్నర్ పదవులు ఇచ్చే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.  

త్వరలో వారి నియామకాలపై ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని పీఎంవో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలను సీనియర్ నేతలతో భర్తీ చేయించేందుకు మోదీ అండ్ షా వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది.  

ఈనెలలో ఐదు రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగియనుంది. ముఖ్యంగా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ పదవీకాలం ఈనెల 16తో ముగియనుంది. యూపీ గవర్నర్ రామ్‌ నాయక్‌ పదవీ కాలం ఈనెల 24తో, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠీ పదవి జులై 24న, త్రిపుర గవర్నర్‌ కప్తాన్‌ సింగ్‌కు జులై 27తో ముగియనుంది.  

మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కూడా మార్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈఎస్ఎల్ నరసింహన్ కు ఉద్వాసన తప్పదని వార్తలు వస్తున్నాయి. ఇకపై నరసింహన్‌ పదవీకాలాన్ని పెంచేందుకు కేంద్రం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

ఇకపోతే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం ఆగష్టు నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో సీనియర్లకు అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  పార్టీలో సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్‌, సుమిత్రమహాజన్ లకు మెుదటిసారిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

పంజాబ్‌ గవర్నర్‌గా సుష్మాస్వరాజ్, మహారాష్ట్ర గవర్నర్‌గా సుమిత్రా మహాజన్‌ లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ల నియామకంపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.