ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కన్నుమూయడంతో గోవా కొత్త సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కం ఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన బీజేపీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చలు జరిపింది.

మరోవైపు సంకీర్ణ కూటమికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కాని వ్యక్తినే కొత్త సీఎంగా ఎన్నుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఈ 12 మందిలో ముగ్గురు గోవా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి చెందిన వారు కాగా, మరో ముగ్గురు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ముగ్గురు స్వతంత్రులు, మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందిన వారు. ఎమ్మెల్యే కాని వ్యక్తి సీఎం అయితే, ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఆరు నెలల్లోపు అంటే అప్పటికే లోక్‌సభ ఎన్నికలు ముగుస్తాయి. మరోవైపు గోవా సీఎం రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఉత్తర గోవా లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీపాద నాయక్, రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండూల్కర్, గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తదితరుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

మరోవైపు పారికర్ మృతితో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీజేపీ, మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఓ హోటల్‌లో సమావేశమవ్వగా.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌ను కోరింది.