MP Election 2023: మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా..
MP Election 2023: త్వరలోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల బరిలో నిలిపే 39 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను విడుదల చేసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

Madhya Pradesh Polls 2023: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిందని ఆ రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. తొలి జాబితాలో భాగంగా అధికార పార్టీ 39 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గురువారం మధ్యప్రదేశ్ లోని ఉమారియాలో తోమర్ విలేకరులతో మాట్లాడుతూ రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
రాబోయే ఎన్నికల కోసం అధికార పార్టీ ఇప్పటికే ప్రచార బాట పట్టగా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేసింది.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ, సెవ్డా, గోవింద్‌పురా, హుజూర్, దిమాని, మోరెనా, పెట్లావాడ్, సిర్మోర్, సిరోంజ్, చుర్హాట్, మహారాజ్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు పది మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ లోని బినా జిల్లాలో గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రతిపక్ష కూటమి ఇండియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సనాతన సంస్కృతిని నాశనం చేసే హిడెన్ ఎజెండాతో ఈ కూటమి పనిచేస్తోందనీ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. ప్రపంచ వేదికలపై భారత్ అగ్రగామిగా ఎదుగుతున్న తరుణంలో కొన్ని పార్టీలు దేశాన్ని, ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. వీరంతా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డారని అన్నారు. మన 'సనాతన' సంస్కృతిని అంతమొందించాలని ఈ ఇండియా కూటమి చూస్తోందని ఆరోపించారు.
కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని 230 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులను ఎన్నుకోనున్నారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, సీనియర్ నేత కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, 2020లో అప్పటి కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 22 మంది విధేయ ఎమ్మెల్యేలు కాషాయ శిబిరంలోకి వెళ్లడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.