కర్ణాటక బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ కరోనాతో మరణించారంటూ వస్తున్న వార్తలను ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు ఖండించాయి.

కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అశోక్ 15 రోజులుగా బెంగళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విషయం తెలుసుకున్న మణిపాల్ హాస్పటల్.. అశోక్ ఆరోగ్యం విషమంగా ఉందని, వైద్య చికిత్స అందిస్తున్నామని చనిపోయారన్న వార్తలు అవాస్తవమని డాక్టర్ సుదర్శన్ బల్లాల్ వెల్లడించారు.

గస్తీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.. న్యూమోనియాతో బాధపడుతున్న అశోక్‌‌కు  ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై వైద్య చికిత్స అందిస్తున్నట్లు సుదర్శన్ స్పష్టం చేశారు. మరోవైపు అశోక్ గస్తీ మరణించారని వార్తలు రావడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం కూడా తెలిపారు.