దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కేంద్రంలోని బీజేపీ నాయకత్వమేనన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసులపై ఫోకస్ పెట్టకుండా ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రచారంలో మునిగిపోయారంటూ విపక్షాలు మండిపడ్డాయి.

ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ నెల 30వ తేదీ నాటికి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీకి ఏడు సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే ఆరోజున నిర్వహించాలనుకున్న వేడుకలను రద్దు చేస్తున్నట్లు నడ్డా ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలంతా కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:యాస్ తుఫాన్‌: ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నాయకత్వాలకు ఆదివారం ఆయన లేఖలు రాశారు. కొవిడ్ కారణంగా చిన్న పిల్లలు అనాథలుగా మారుతున్నారని, వారికి వీలైనంత తొందరగా సహకారాన్ని అందించాలని జేపీ నడ్డా కోరారు.

తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు అన్ని రకాల సాయాన్ని అందించి వారి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దాలన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కావాలని జేపీ నడ్డా పేర్కొన్నారు.