దక్షిణ ఢిల్లీలో ఉన్న మహ్మద్‌పూర్ అనే గ్రామాన్ని మాధ‌వ‌పురంగా మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. 

ఢిల్లీలోని మహ్మద్‌పూర్ అనే గ్రామం పేరును ఆ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మాధ‌వ‌పురంగా మార్చారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ప్ర‌క‌టిచారు. బుధ‌వారం నాడు ఆయ‌న త‌న పార్టీ సీనియర్ నేతలతో కలిసి గ్రామ ప్రవేశద్వారం వద్ద ‘వెల్‌కమ్ టు మాధవపురం’ అని రాసి ఉన్న బోర్డును పెట్టారు. 
ఈ సంద‌ర్భంగా ఆదేశ్ గుప్తా మాట్లాడుతూ.. దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం చర్య తీసుకోలేద‌ని అన్నారు. అందుకే తామే స్వయంగా దక్షిణ ఢిల్లీలోని మహ్మద్‌పూర్ గ్రామం పేరును మాధవపురంగా ​​మార్చినట్టు చెప్పారు. ఈ ప్ర‌క్రియ గ‌తేడాది డిసెంబ‌ర్ నుంచి సాగుతోంద‌ని అన్నారు. 

“ మాధవపురంగా ​​పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదించిన తర్వాత, పేరు మార్చే ప్రక్రియ ఈరోజు పూర్తయింది. ఇక నుంచి ఈ గ్రామాన్ని మహ్మద్‌పూర్‌గా కాకుండా మాధవపురంగా ​​పిలుస్తాము. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత నగరంలో బానిసత్వానికి సంబంధించిన ఏ చిహ్నమూ ఉండాల‌ని ఢిల్లీ వాసులు కోరుకోవడం లేదు’’ అని గుప్తా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అలాగే ఈ పేరు మార్పుకు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేశారు. 

కాగా కార్పొరేషన్ ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం రోడ్లు, గ్రామాలకు పేర్ల‌ను రాష్ట్ర నామకరణ అథారిటీ ఆమోదించాలి. కానీ ప్ర‌భుత్వం నంచి అనుమ‌తి రాక‌ముందే ఢిల్లీ బీజేపీ నాయ‌క‌త్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకుంది. ఢిల్లీ బీజేపీ ఎత్తుగడపై నగర పాలక సంస్థ స్పందించలేదు.

Scroll to load tweet…

హౌజ్ ఖాస్, బేగంపూర్, షేక్ సరాయ్ వంటి 40 గ్రామాల పేర్లు బానిస‌త్వానికి చిహ్నంగా ఉన్నాయ‌ని, వాటి పేర్ల‌ను మార్చేందుకు పార్టీ త‌ర‌ఫున ఢిల్లీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు ఆదేశ్ గుప్తా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కే బీజేపీ నాయ‌కులు ఇలా వెళ్లి పేరు మార్చారు. అయితే డిసెంబరు 9వ తేదీన మహ్మద్‌పూర్ గ్రామం పేరును మాధవపురంగా ​​మార్చాలని మున్సిప‌ల్ కార్పొరేషన్ ఒక ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వ పట్టణాభివృద్ధి విభాగానికి పంపిందని గుప్తా ఇటీవల చెప్పారు. అధికార పార్టీ నాయ‌కులు ఒక నిర్దిష్ట వర్గాన్ని సంతోషపెట్టాలని కోరుతున్నారని ఆయ‌న ఆరోపించారు. 

మిగతా గ్రామాల పేర్లను మార్చే ప్రతిపాదనను త్వరలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆదేశ్ గుప్తా తెలిపారు. 40 గ్రామాల జాబితాలో ఎస్ హుమాయూన్‌పూర్, యూసుఫ్ సరాయ్, మసూద్‌పూర్, జమ్రుద్‌పూర్, బేగంపూర్, ఫతేపూర్ బేరి, హౌజ్ ఖాస్, షేక్ సరాయ్ తదితరాలు ఉన్నాయని ఆయ‌న చెప్పారు. ఈ గ్రామాల నుంచి తమ పేర్లను మార్చాలని పార్టీకి చాలా అభ్యర్థనలు వస్తున్నాయని, వాటి పేర్లను మార్చడానికి ప్రతిపాదనలు ప్రారంభించడానికి కార్పొరేషన్ల మేయర్‌లు, కమిషనర్‌లకు లేఖ రాస్తానని గుప్తా చెప్పారు.