Tamil Nadu: హిజాబ్ ధరించిన ముస్లిం మహిళను పోలింగ్‌ బూత్‌లో బీజేపీ కార్యకర్త అడ్డుకున్నాడు. ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను హిజాబ్‌ తీసివేయాలంటూ ఇబ్బందికి గురిచేస్తూ.. హల్‌చల్‌ చేశాడు. తమిళనాడులో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో మధురైలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

Tamil Nadu: కర్నాట‌క‌లోని ప‌లు విద్యాసంస్థ‌ల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ దుమారం రేపుతున్న‌ది. క‌ర్నాట‌క నుంచి హిజాబ్ వివాదం ఇత‌ర రాష్ట్రాల‌కు పాకుతోంది. ఈ నేప‌థ్యంలోనే హిజాబ్ ధరించిన ముస్లిం మహిళను పోలింగ్‌ బూత్‌లో బీజేపీ కార్యకర్త అడ్డుకున్నాడు. ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను హిజాబ్‌ తీసివేయాలంటూ ఇబ్బందికి గురిచేస్తూ.. హల్‌చల్‌ చేశాడు. తమిళనాడులో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో మధురైలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళ‌నాడులో చాలా కాలం త‌ర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధురైలో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఒక ముస్లిం మహిళను అక్కడున్న బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యుడు ఇబ్బంది పెట్టాడు. ఆమె హిజాబ్‌ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. హిజాబ్‌ తీసివేయాలంటూ గట్టిగా కేకలు వేస్తూ.. హంగామా సృష్టించాడు. ఆ మ‌హిళ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేశాడు.

ఈ క్ర‌మంలోనే పోలింగ్‌ బూత్ ద‌గ్గ‌ర ఉన్న పోలీసు సిబ్బంది, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సభ్యులు జోక్యం చేసుకోవ‌డంతో స‌ద‌రు మ‌హిళ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు బూత్ నుంచి వెళ్లాల‌ని పోలీసులు బీజేపీ సభ్యుడిని కోరారు. కాగా, ఈ ఘ‌ట‌న‌ను రాష్ట్రంలోని ఇత‌ర బీజేపీ మిన‌హా ఇత‌ర పార్టీల‌న్ని ఖండించాయి. 

Scroll to load tweet…

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను మీడియా స్పంద‌న కోర‌గా.. "బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తోంది. మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని తిరస్కరించాలో తమిళనాడు ప్రజలకు తెలుసు. వారు దానిని ఎప్పటికీ అంగీకరించరు" అని పేర్కొన్నారు. కాగా, విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ముస్లిం బాలికలు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన నిరసనల మధ్య, కోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో విద్యా సంస్థలలో మతపరమైన సంబంధాన్ని కలిగి ఉన్న ఎలాంటి దుస్తులు ధరించకుండా నిరోధించాలని ఆదేశించింది.

కాగా, త‌మిళ‌నాడులో 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలతో సహా 648 పట్టణ స్థానిక సంస్థలలో 12,607 వార్డు సభ్యుల స్థానాలకు 57,778 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 31,000 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ కొన‌సాగుతోంది. చెన్నైలో, 5,013 పోలింగ్ బూత్‌లలో 213 ఉద్రిక‌త్త ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే, 54 'క్లిష్టమైనవిగా గుర్తించిన పోలీసు యంత్రాంగం దానికి త‌గిన‌ట్టుగా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు పేర్కొంది. 390 మొబైల్ బృందాలు స‌హా మొత్తం 22,000 మంది పోలీసులను ఇక్కడ మోహరించారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా. ఓటింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, చివరి 1 గంట కరోనా బారిన పడిన వ్యక్తులకు కేటాయించబడింది.