ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారంనాడు ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు.

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం నాడు ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మణిపూర్ అంశంపై విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మణిపూర్ లో హింసతో పాటు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై సభలో చర్చకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలు నిన్న సభలో ప్రకటించారు. అయితే ప్రధాని మోడీ సమక్షంలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ నెల 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. మణిపూర్ ఘటనను ఎవరూ కూడ సమర్ధించరని చెప్పారు. మరో వైపు ఈ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే సోమవారం నాడు రాత్రి పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.మణిపూర్ విషయమై విపక్ష పార్టీ ఎంపీలు చర్చకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఇవాళ కూడ మణిపూర్ అంశంపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అయితే విపక్ష పార్టీలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ సమావేశంలో వ్యూహం రచించనున్నారు. గత సమావేశాల్లో కూడ విపక్షాలు ఇదే తరహలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే