బెంగళూరు: కర్ణాటక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. బిజెపిపై కాంగ్రెసు కోలార్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ సంచలన ఆరోపణలు చేశారు. తమ వైపు వస్తే రూ. 30 కోట్లు ఇస్తామని బిజెపి ఆఫర్ చేసిందని ఆయన చెప్పారు. తాను తిరస్కరించినప్పటికీ బలవంతంగా తన ఇంటికి వచ్చి రూ. 5 కోట్లు ఇచ్చి వెళ్లారని ఆయన అన్నారు. 

శాసనసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష నేపథ్యంలో చర్చ జరుగుతున్న సమయంలో శ్రీనివాస గౌడ లేచి ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తాను బాధితుడనని చెప్పారు. తన ఇంటికి ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు, ఓ మాజీ మంత్రి వచ్చి రూ.5 కోట్లు బలవంతంగా పెట్టి వెళ్లారని ఆయన అన్నారు. 

బిజెపి నేతలు తనను ఎంత ప్రలోభపెట్టినా తను లొంగిపోలేదని స్పష్టం చేశారు. బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. దానిపై బిజెపి ఎమ్మెల్యే మాధుస్వామి తీవ్రంగా ప్రతిస్పందించారు. 

కాంగ్రెసు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ చేసిన వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లాయని, గౌడపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉందని ఆయన అన్నారు. శాసనసభ భోజన విరామానికి వాయిదా పడిన సమయంలో బిజెపి అధ్య.క్షుడు యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. 

శ్రీనివాస గౌడ వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ఆయన అన్నారు. అందుకు శ్రీనివాస గౌడ ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. ఆధారాలు చూపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్రీనివాస గౌడపై పార్టీ తరఫున పరువు నష్టం దావా వేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.