Asianet News TeluguAsianet News Telugu

నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ఢిల్లీలో ప్రధాని మోదీ రోడ్ షో.. నడ్డా పదవీ కాలం పొడిగించే అవకాశం!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేడు న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
 

BJP national executive meeting to begins today PM Modi to hold roadshow in Delhi
Author
First Published Jan 16, 2023, 9:38 AM IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేడు న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. మంగళవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సమావేశం జరిగే ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో గుడ్ గవర్నెన్స్ ఫస్ట్, ఇన్‌క్లూజివ్ అండ్ ఎంపవర్డ్ ఇండియా, విశ్వ గురు భారత్‌తో సహా ఆరు విభిన్న థీమ్‌ల ఆధారంగా మెగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాకు వివరించారు. ఇక, ఈ సమావేశానికి ముందు ఎజెండాకు తుది మెరుగులు దిద్దేందుకు సోమవారం ఉదయం బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం మొదటి రోజు.. మధ్యాహ్నం పటేల్ చౌక్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు బీజేపీ రోడ్ షోను నిర్వహించనుంది. ఈ రోడ్‌ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. ఇక, ఈ సమావేశాల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరుతో బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగియనుండగా.. మరో ఏడాది పాటు పొడిగింపును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చివరగా 2022 జూలైలో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రూపొందించిన కార్యచరణ అమలును ఈ సమావేంలో అంచనా వేయనున్నారు. 2023 తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ జాబితాలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ ఏడాదే కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ  కాశ్మీర్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో.. ఆయా రాష్ట్రాల ఎన్నికల సన్నాహాలను సమీక్షించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పోరాటాల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios