17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్ర కుమార్ వ్యవహరించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు శాఖ ఈ మేరకు వీరేంద్రకుమార్ పేరును ఖరారు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. వీరేంద్రతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించున్నారు. దళిత వర్గానికి చెందిన వీరేంద్ర తొలుత ఏబీవీపీ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1975లో జేపీ మూవీమెంట్‌లో విద్యార్ధి నేతగా చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ, చైల్డ్ లేబర్ అంశంపై పీహెచ్‌డీ చేశారు.

1977-79 మధ్య కాలంలో ఏబీవీపీ కన్వీనర్‌గా పనిచేశారు. మోడీ ప్రభుత్వంలో 2014లో మోడీ తొలి మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఆయన సేవలందించారు.

మధ్యప్రదేశ్‌లోని తిక‌మార్ఘ్ నుంచి వరుసగా ఏడవసారి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత వీరేంద్రకుమార్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 19న జరిగే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను కూడా ప్రొటెం స్పీకరే నిర్ణయిస్తారు.