Asianet News TeluguAsianet News Telugu

‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం’.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్

కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశానికి 2014లోనే స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో మనకు వచ్చింది స్వాతంత్ర్యం కాదనీ, కేవలం భిక్షమే అని ఆమె నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్ అయ్యారు.
 

bjp mp varun gandhi slams kangana ranaut for her freedom remarks
Author
New Delhi, First Published Nov 11, 2021, 5:41 PM IST

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్న బాలీవుడ్ నటి Kangana Ranaut మరోసారి వివాదానికి కేంద్రంగా మారారు. జాతీయ మీడియా టైమ్స్ నౌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. British పాలనకు కొనసాగింపే Congress హయాం అని కంగనా రనౌత్ అన్నారు. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని చెప్పారు. అంతేకాదు, 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదని, కేవలం భిక్షమే అని నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

2014లో నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే ఏడాదిని కంగనా రనౌత్ పేర్కొంటూ దేశానికి అప్పుడే Freedom వచ్చిందని అన్నారు. అలాగైతే, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మరెందరో స్వాతంత్ర్య సమర యోధులు దేనికోసం పోరాడారని, వారి ఆత్మ బలిదానాలకు విలువే లేదా? అంటూ చాలా మంది నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో BJPకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే, స్వాతంత్ర్యానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్ అయ్యారు. అవి పిచ్చి మాటలా? లేక దేశ ద్రోహమా? అంటూ MP Varun Gandhi సంశయాన్ని వ్యక్తం చేశారు.

‘మహాత్మా గాంధీ త్యాగాన్ని ఒక్కోసారి హేళన చేస్తున్నారు.. మరోసారి ఆయనను చంపేసిన వ్యక్తిని కొలుస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్.. కొన్ని లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు’ అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. దీన్ని నేను పిచ్చితనం అనాలా? లేక దేశ ద్రోహం అని పిలవాలా? అంటూ ప్రశ్నించారు. ఇది కచ్చితగా దేశ ద్రోహ చర్యే అని తెలిపారు. ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నా.. మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించడానికి రక్తాన్ని ధారపోసిన వారందరినీ మోసం చేసినవారమవుతామని అన్నారు.

వరుణ్ గాంధీ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తి చేసిన తర్వాత కంగనా రనౌత్ స్పందించారు. స్వాతంత్ర్యానికి సంబంధించి ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 1857లో జరిగినదే తొలి స్వాతంత్ర్య సంగ్రామమని తాను స్పష్టంగా ప్రస్తావించారని కంగనా రనౌత్ అన్నారు. అయితే, ఆ పోరాటాన్ని బ్రిటీషర్లు దారుణంగా అణచివేశారని పేర్కొన్నారు. ఆ తర్వాతే బ్రిటీషర్ల అరాచకాలు మరింత పెరిగాయని చెప్పారని తాజాగా వివరించారు. గాంధీ అడుక్కునే రూపంలో బ్రిటీషర్లు భారతీయులకు మరో శతాబ్ద కాలాన్ని ఇచ్చారని అన్నారు.

కంగనా రనౌత్‌కు ఇదే నెలలో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

రైతుల ఆందోళనకు సంబంధించి వరుణ్ గాంధీ కొంత కాలం నుంచి కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. లఖింపూర్ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన మరింత సీరియస్‌గా కేంద్రంపై దాడి మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా వరుణ్ గాంధీ తన విమర్శలను ఆపలేదు. రైతులపై వ్యతిరేక వైఖరి తీసుకోవద్దని ఆవేశపూరితంగా మాట్లాడుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి తన పంథాలో మార్పు లేదని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios