వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  కాగా.. సుప్రీం ఇచ్చిన తీర్పుని సుబ్రమణియన్ స్వామి తప్పుపట్టారు. అక్కడితో ఆగకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

స్వలింగ సంపర్కానికి అనుమతి ఇస్తే హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసులు మరింత పెరిగిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కి తీసుకెళ్లవచ్చని తెలిపారు.

సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్‌ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా  పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు.

స్వలింగ సంపర్కం గురించి సుమారు 157 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి  సుప్రీం కోర్టు నేటితో స్వస్తి పలికింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం.