గత కొంత కాలంగా సొంత పార్టీపైనే విమర్శలకు దిగుతూ పాట్నా సాహిబ్ ఎంపీ, సిని నటుడు శత్రుఘ్న సిన్హాకు భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై బిజెపి అదినాయకత్వం కూడా గుర్రుగా వుంది. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న అతడిని దెబ్బతీసేందకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రిగా, ప్రస్తుత ఎంపీగా అతడికి విమానాశ్రయాల్లో లభించే వీఐపి హోదాను ఉపసంహరించుకుంది. 

ఎంపీ శత్రుఘ్న సిన్హాకు ఎయిర్‌పోర్ట్‌లో లభించే వీఐపీ హోదా రద్దయినట్లు పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజెంద్ర సింగ్ లాహూరియా వెల్లడించారు. ఇప్పటివరకు ఆయనకు భద్రతా తనిఖీ నుండి మినహాయింపు ఉండటంతో పాటు ఎయిర్ పోర్టులో మరికొన్ని ప్రత్యేక సదుపాయాలుండేవి. అయితే ఆయనకు వీఐపి హోదాలో అమలయ్యే సదుపాయలన్నింటిని రద్దు చేస్తున్నట్లు లాహరియా వెల్లడించారు. ఈ సదుపాయాల పునరుద్దరణకు తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వల్లే రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రముఖులు, రాజకీయ నాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే ఎవరికి ఈ సదుపాయాలు  కల్పించాలన్న దానిపై ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ప్రత్యేక సమాచారం ఉంటుంది. దీన్ని బట్టే అధికారులు సాధారణ ప్రయాణికుల వేరుగా, వీఐపిలకు వేరుగా తనిఖీలు చేపడుతుంటారు. ఇలాంటి సదుపాయాలకే తాజాగా శత్రుఘ్న సిన్హా దూరమయ్యారు.